కోల్‌ ఇండియా లాభం రూ. 3,170 కోట్లు

11 Aug, 2021 01:12 IST|Sakshi

క్యూ1లో 52 శాతం జంప్‌

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 3,170 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,080 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,487 కోట్ల నుంచి రూ. 25,282 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,471 కోట్ల నుంచి రూ. 21,626 కోట్లకు పెరిగాయి. క్యూ1లో బొగ్గు ఉత్పత్తి 121.04 మిలియన్‌ టన్నుల నుంచి దాదాపు 124 ఎంటీకి బలపడింది. ముడిబొగ్గు అమ్మకాలు 120.80 ఎంటీ నుంచి 160.44 ఎంటీకి పెరిగాయి. రానున్న మూడేళ్లలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. బొగ్గు వెలికితీత, తరలింపు, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్, శుద్ధ ఇంధన సాంకేతికతలు తదితరాలకు ఈ నిధులను వెచ్చించనుంది. తద్వారా 2023–24కల్లా 100 కోట్ల టన్నుల కోల్‌ ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు వేసింది. 
ఫలితాల నేపథ్యంలో కోల్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 142 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు