తగ్గుతున్న బొగ్గు నిల్వలు..పొంచి ఉన్న విద్యుత్‌ సంక్షోభం 

20 Apr, 2022 10:40 IST|Sakshi

విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య ఆందోళన 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలకు సమస్య ఏర్పడుతోందని.. ఇది పొంచి ఉన్న విద్యుత్‌ సంక్షోభాన్ని సూచిస్తున్నట్టు అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘రాష్ట్రాల్లో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. థర్మల్‌ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడమే సమస్యకు కారణం. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా రోజువారీ నివేదిక ప్రకారం చూస్తే.. దేశీ బొగ్గును వినియోగించే 150 థర్మల్‌ ప్లాంట్లకు గాను 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి క్లిష్టంగా ఉంది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి ఇంతే ఉంది’’అని ఏఐపీఈఎఫ్‌ అధికార ప్రతినిధి వీకే గుప్తా పేర్కొన్నారు.  

పెరిగిన బొగ్గు సరఫరా: సీఐఎల్‌ 
బొగ్గు ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన కోల్‌ ఇండియా (సీఐఎల్‌) బొగ్గు సరఫరా పెంచినట్టు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను 14.2 శాతం అధికంగా సరఫరా చేసినట్టు తెలిపింది. ఈ కాలంలో సరఫరా రోజువారీ 1.6 మిలియన్‌ టన్నులుగా ఉందని.. 2021 ఏప్రిల్‌ మొదటి భాగంలో రోజువారీ సరఫరా 1.43 టన్నులుగానే ఉన్నట్టు వివరించింది. అయితే వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోయిందని, దీంతో పెరిగిన బొగ్గు సరఫరా ప్రభావం కనిపించడం లేదని పేర్కొంది. బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖల మధ్య సమన్వయంతో విద్యుత్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచే చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.  

చదవండి: భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు..తగ్గనున్న వినియోగం..!

మరిన్ని వార్తలు