కాఫీడే....చేదు ఫలితాలు

2 Jul, 2021 10:01 IST|Sakshi

క్యూ4లో రూ. 272 కోట్ల నష్టం

కాఫీ విభాగం బిజినెస్‌ డౌన్‌ 

న్యూఢిల్లీ: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి–మార్చి)కి సంబంధించి రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 69 శాతం క్షీణించి రూ. 165 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 534 కోట్ల టర్నోవర్‌ సాధించింది. కాగా.. క్యూ4లో సికాల్‌ లాజిస్టిక్స్‌లో గల ఈక్విటీ షేర్ల విలువ తగ్గిన కారణంగా రూ. 151 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాఫీ డే పేర్కొంది. కోవిడ్‌–19 కారణంగా తలెత్తిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలు బిజినెస్‌ కార్యకలాపాలు, సప్లై చైన్‌ దెబ్బతిన్నట్లు తెలియజేసింది.  

డైరెక్టర్‌ రాజీనామా 
క్యూ4లో కాఫీ, తత్సంబంధిత ఆదాయం 61 శాతంపైగా క్షీణించి రూ. 141 కోట్లకు పరిమితమైనట్లు కాఫీడే పేర్కొంది. అయితే ఆతిథ్య సర్వీసుల టర్నోవర్‌ 40 శాతం ఎగసి రూ. 11 కోట్లను తాకినట్లు వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 652 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో దాదాపు రూ. 1,849 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం 67 శాతం పడిపోయి రూ. 853 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 2,552 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే 2019–20లో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీలో ఈక్విటీ వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 1,828 కోట్లు కలసి ఉన్న విషయాన్ని కాఫీడే ఫలితాల సందర్భంగా ప్రస్తావించింది. అంతేకాకుండా గ్లోబల్‌ విలేజ్‌ ప్రాపర్టీ అమ్మకం ద్వారా మరో రూ. 1,190 కోట్లు లభించినట్లు తెలియజేసింది. కాగా.. 2020–21లో వే2వెల్త్‌ సెక్యూరిటీస్‌ విక్రయం ద్వారా రూ. 151 కోట్లు లభించినట్లు పేర్కొంది.  జర్మనీలో నివసిస్తున్న కంపెనీ డైరెక్టర్‌ ఆల్బర్ట్‌ జోసెఫ్‌ హీరోనిమస్‌ వ్యక్తిగత ఆరోగ్య రీత్యా పదవికి రాజీనామా చేసినట్లు కాఫీడే వెల్లడించింది. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా కస్టమర్ల ప్రాంతాల నుంచి వెండింగ్‌ మెషీన్ల వినియోగానికి రూపొందించిన 30,000 కేబినెట్లను వెనక్కి తీసుకున్నట్లు కాఫీడే తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.6 శాతం ఎగసి రూ. 41.30 వద్ద ముగిసింది. 

చదవండి : జెట్‌ ఎయిర్‌వేస్‌లోకి రూ. 1,375 కోట్లు!

మరిన్ని వార్తలు