Coforge Q4 Results: కోఫోర్జ్‌ లాభం 17% అప్‌

7 May, 2021 06:09 IST|Sakshi

క్యూ4లో రూ. 133 కోట్లు

12,391కు ఉద్యోగుల సంఖ్య

షేరుకి రూ. 13 డివిడెండ్‌

న్యూఢిల్లీ: గతంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌గా ఐటీ సేవలందించిన కంపెనీ కోఫోర్జ్‌ లిమిటెడ్‌ 2020–21 చివరి క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 133 కోట్లను తాకింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 1,261 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 13 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు ఈ నెల 19 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. నిర్వహణ లాభ మార్జిన్లు 18 శాతంగా నమోదయ్యాయి.

ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్లౌడ్‌ సర్వీసెస్‌లో మాకున్న సామర్థ్యాలు, భాగస్వామ్యాలు, ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీని వృద్ధి బాటలో నిలుపుతున్నట్లు కోఫోర్జ్‌ సీఈవో సుధీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. తద్వారా ట్రాన్స్‌ఫార్మేషన్‌కు దారిచూపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో కనీసం 17 శాతం వృద్ధిని సాధించగలమంటూ కోఫోర్జ్‌ తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో గతేడాదితో పోలిస్తే 1 శాతం అధికంగా 19 శాతం ఇబిటా మార్జిన్లు నమోదుకావచ్చని పేర్కొంది.

డాలర్ల రూపేణా క్యూ4లో 7.1 శాతం త్రైమాసిక వృద్ధిని సాధించడం ద్వారా ఈ ఏడాది పటిష్ట ఫలితాలు సాధించే బాటలో సాగుతున్నట్లు అభిప్రాయపడింది. మెరుగైన టర్నోవర్, మార్జిన్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. గతేడాది 78.1 కోట్ల డాలర్ల ఆర్డర్లను పొందినట్లు వెల్లడించింది. 2021 మార్చికల్లా ఉద్యోగుల సంఖ్య 12,391కు చేరగా.. క్యూ4లో 967 మంది ఉద్యోగులు జత కలసినట్లు వివరించింది.

ఎన్‌ఎస్‌ఈలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 3,387 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,449 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఒక దశలో రూ. 2,822 దిగువన కనిష్టాన్ని సైతం చూసింది.

మరిన్ని వార్తలు