కాగ్నిజెంట్‌ క్యూ1 ఫలితాలు భేష్‌

7 May, 2021 05:29 IST|Sakshi

నికర లాభం 38 శాతం అప్‌

2021పై ఆశావహ అంచనాలు

2,96,500కు ఉద్యోగుల సంఖ్య

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 38 శాతం జంప్‌చేసి 50.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,737 కోట్లు)ను తాకింది. గతేడాది(2020) తొలి త్రైమాసికంలో 36.7 కోట్ల డాలర్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్ల(రూ. 32,560 కోట్లు)కు చేరింది. కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

డిసెంబర్‌తో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయంలో 7–9 శాతం పురోగతిని అంచనా వేస్తోంది. యూఎస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీకి దేశీయంగా 2 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. క్యూ1లో డిజిటల్‌ విభాగంలో అభివృద్ధి, అంతర్జాతీయంగా విస్తరణ, కాగ్నిజెంట్‌ బ్రాండుకు ప్రాచుర్యం వంటి అంశాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియాన్‌ హంఫ్రీస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్‌ 2,96,500 మంది ఉద్యోగులున్నారు. 2021పై కంపెనీ ఆశావహ అంచనాల్లో ఉంది.

మరిన్ని వార్తలు