Cognizant: గుడ్‌ న్యూస్‌, భారీ నియామకాలు

29 Jul, 2021 15:27 IST|Sakshi

సుమారు లక్ష  లేటరల్‌ ఉద్యోగుల నియామకాలు

ఈ ఏడాది 30 వేల  గ్రాడ్యుయేట్లకు అవకాశం: కాగ్నిజెంట్ టెక్నాలజీ

2022 లో 45 వేల ఉద్యోగాలు 

సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్‌  రేటు అధికంగా  నమోదవుతున్న  కారణంగా సంస్థ  ఈ నిర్ణయం తీసుకుంది.  అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్‌లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ  ప్రకటించింది.

కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ,  అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో  కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్‌ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చా‍మన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లోఆన్‌బోర్డింగ్‌ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్‌ ఇస్తామన్నారు. అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకో నున్నట్టు తెలిపారు.

తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్‌ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్‌సేషన్‌, సర్దుబాట్లు, ఉద్యోగ భ్రమణాలు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లు లాంటి  చర్యలపై దృష్టిపెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్‌ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు  శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ త్రైమాసికంలో డిజిటల్ రెవెన్యూ వృద్ధి సంవత్సరానికి 20 శాతానికి పెరిగిందని వెల్లడించిన ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్నారు. మూడవ త్రైమాసిక ఆదాయం 4.69 - 4.74 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండనుందని, 10.6-11.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ సీగ్మండ్ చెప్పారు.

కాగా జూన్ 2020 త్రైమాసికంలో కాగ్నిజెంట్  41.8 శాతం వృద్దితో, 512 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 3,802 కోట్లు)  నికర ఆదాయాన్ని నివేదించింది. అలాగే 10.2-11.2 శాతం  (స్థిరమైన కరెన్సీలో 9-10 శాతం) వృద్ధి అంచనాలను ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు  భారతదేశంలో  సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు.

మరిన్ని వార్తలు