గుడ్‌న్యూస్‌: త్వరలో ఇండియాలో కాయిన్‌బేస్‌ ఆఫీస్‌

4 Jul, 2021 13:23 IST|Sakshi

వెస్ట్రన్‌ కంట్రీస్‌లో పెట్టుబడికి న్యూ అడ్రెస్‌గా మారిన క్రిప్టోకరెన్సీ ఇకపై భారత్‌లోనూ తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోనుంది. ఇందుకు కారణం క్రిప్టోకరెన్సీ లావాదేవీలు నిర్వహించే కాయిన్‌బేస్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో క్రిప్టోకరెన్సీకి ఇండియాలో రెడ్‌కార్పెట్‌ పరుచుకోనుంది. ఈ మేరకు కాయిన్‌ బేస్‌ సహా వ్యవస్థాపకుడు, సీఈవో బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కీలక ప్రకటన చేశారు. 

ఇండియా కేంద్రంగా
అమెరికాలో సంచనలంగా మారిన క్రిప్టో కరెన్సీని ఆసియా మార్కెట్‌కి విస్తరించే పనిలో భాగంగా కాయిన్‌బేస్‌ సంస్థ  ఆసియాలో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. ఇందుకు భారత్‌ని ప్రధాన కేంద్రంగా చేసుకోనుంది. అందులో భాగంగా ఇండియాలో కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా చేపడుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రకటించారు. అంతేకాదు వచ్చి మాతో చేతులు కలపండి అంటూ ఆహ్వానం పలికారు.

క్రిప్టోకి డిమాండ్‌
అమెరికాకు చెందిన కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీని 2012లో స్థాపించారు. క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి పనులు ఈ కంపెనీ చేపడుతోంది. కంపెనీ ప్రారంభించిన తర్వాత పదేళ్లకు ఇండియాలోకి కాయిన్‌బేస్‌ వస్తోంది. కాయిన్‌బేస్‌ రాకతో క్రిప్టోకరెన్సీ లావదేవీలు ఇండియాలో పెరగవచ్చని, కాయిన్‌బేస్‌ కంపెనీకి మంచి స్పందనే రావొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే విధంగా డిజిటల్‌ కాయిన్‌ మార్కెట్‌కు సంబంధించిన రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు