క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం! ఈలోపే భారత్‌లో మరో..

29 Nov, 2021 10:10 IST|Sakshi

Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్‌ బిట్‌కాయిన్‌స్టోర్‌ భారత్‌లో అడుగుపెట్టింది. 


సింగపూర్‌కి చెందిన వర్చువల్‌ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్‌ కాయిన్‌స్టోర్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్‌(సెప్టెంబర్‌లో లాంఛ్‌ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్‌ ఎక్సేంజ్‌ కాయిన్‌స్టోర్‌ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్‌లతో కాయిన్‌స్టోర్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్‌డాలర్ల బడ్జెట్‌తో భారత మార్కెట్‌లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ చార్లెస్‌ టాన్‌ వెల్లడించారు. 

అయితే ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్‌ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్‌స్టోర్‌ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి.  అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్‌ టాన్‌ తెలిపారు. భారత్‌తో పాటు జపాన్‌, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. 

Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?

ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్‌.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్‌ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది.  మరి ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు

మరిన్ని వార్తలు