5 స్టార్‌ బ్రాండ్‌ బాజా!

27 Nov, 2020 01:34 IST|Sakshi

బ్రాండ్‌ ఏదైనా.. స్టార్స్‌ వీరే...

కరోనా కాలంలోనూ క్యూ కడుతున్న కంపెనీలు

కోహ్లీ, ఖురానా, ధోనీ, అమితాబ్, అక్షయ్‌లకు డిమాండ్‌

వీరు కనిపిస్తే రేటింగ్స్‌కు రెక్కలు

బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియామకానికి ఆసక్తి  

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగాలుపడినా.. బాలీవుడ్, క్రికెట్‌ స్టార్స్‌కు ప్రచారకర్తలుగా డిమాండ్‌ చెక్కుచెదరలేదు. అంతేకాదు వీరి మార్కెట్‌ ఇంకా విస్తరిస్తూనే ఉంది. నటుడు ఆయుష్మాన్‌ ఖురానా (36) 19 బ్రాండ్లకు ప్రచారకర్తగా (బ్రాండ్‌ అంబాసిడర్‌) వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు, బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. ఇవేవీ   ఖురానా మార్కెట్‌ను అడ్డుకోలేకపోయాయి.

కోల్గేట్‌ పామోలివ్‌ తాజాగా ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇక అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్, విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ సైతం కరోనా కల్లోలంలో గట్టిగా నిలబడిన స్టార్సే కావడం గమనార్హం. ఇతర స్టార్స్‌ మార్కెట్‌ బోసిపోయినా కానీ, అమితాబ్, ఖురానా, అక్షయ్, ధోనీ, కోహ్లీలను తమ ప్రచారకర్తలుగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నాయి.

అక్షయ్‌ కుమార్‌ టాప్‌
బాలీవుడ్‌లో వరుస హిట్‌లతో అదరగొడుతున్న అక్షయ్‌ కుమార్‌... ప్రచార కార్యక్రమాల్లోనూ దుమ్మురేపుతున్నారు.‡ గత నెల రోజుల్లోనే అక్షయ్‌ ఏకంగా నాలుగు నూతన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోధా గ్రూప్, డాలర్‌ ఇండస్ట్రీస్, బెర్జర్‌ పెయింట్స్, పాలసీబజార్‌ కంపెనీలు అక్షయ్‌తో ప్రచార కార్యక్రమాలు రూపొందించుకున్నాయి.

టెలివిజన్‌లపై వచ్చే ప్రచార ప్రకటనల్లో అక్షయ్‌ తరచుగా కనిపిస్తుండడం చాలా మందికి పరిచయమే. భారత క్రికెట్‌ జట్టు సార«థి అయిన విరాట్‌ కోహ్లీ ‘వైజ్‌’ అనే హెల్త్‌కేర్, శానిటైజర్‌ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఇటీవలే సంతకం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు తక్షణం ముగింపు పలుకుతున్నట్టు మహేంద్రసింగ్‌ ధోనీ ప్రకటించినా కానీ.. కంపెనీలు ఆయన రూపాన్ని తమ ఉత్పత్తుల విక్రయాలకు అపురూపంగానే భావిస్తున్నాయి. 78 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌ బచ్చన్‌ పట్ల బ్రాండ్లకు ఆకర్షణ తగ్గడం లేదు. వరుసగా ఒక దాని వెంట ఒక కంపెనీ ఆయనతో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నాయి.

బచ్చన్‌ అంటే నమ్మకం!
దేశంలోనే అత్యంత విశ్వసనీయ సెలబ్రిటీ అమితాబ్‌ బచ్చన్‌ అని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ ఇటీవలే నిర్వహించిన సర్వేలో ప్రజలు తేల్చి చెప్పారు. టీఐఏఆర్‌ఏ రేటింగ్స్‌ ప్రకారం బచ్చన్‌ స్కోరు 90 పాయింట్లు. అత్యధికంగా 93.5 పాయింట్లతో అక్షయ్‌కుమార్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం బచ్చన్‌దే. ఆయుష్మాన్‌ ఖురానా స్కోరు 88.5 పాయింట్లు.

క్రీడాకారుల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి మహేంద్ర సింగ్‌ ధోనీ. ధోనీ స్కోరు 87 పాయింట్లు. 63.9 పాయింట్లతో కోహ్లీ టాప్‌ 5లో ఆఖరున ఉన్నారు. కాకపోతే కోహ్లీ (మోస్ట్‌ హ్యాండ్సమ్‌) అందగాడుగా సర్వేలో నిలిచారు. దేశవ్యాప్తంగా 23 పట్టణాల నుంచి 60వేల మంది అభిప్రాయాలను ఈ సర్వే కోసం సేకరించారు. ఈ ఐదుగురు స్టార్స్‌ 2021లోనూ తమ హవా కొనసాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెలబ్రిటీలకు పరీక్షా కాలం
‘‘సెలబ్రిటీలకు ప్రచార కార్యక్రమాల పరంగా 2020 కష్టమైనది. తొలి 6 నెలలు లాక్‌డౌన్‌తో కరిగిపోయింది. ద్వితీయ భాగంలో రాజ్‌పుత్‌ కేసు, బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. అమితాబ్‌ బచ్చన్, కోహ్లీ, ధోనీ, ఖురానా, అక్షయ్‌కుమార్‌ మాత్రం ఈ పరిస్థితులను సునాయాసంగానే అధిగమించి తమ బ్రాండ్‌ విలువను గట్టిగానే కాపాడుకున్నారని చెప్పుకోవాలి.

వివాదాల్లో లేని స్టార్స్‌ పట్ల కంపెనీలు ప్రాముఖ్యం చూపిస్తున్నాయి’’ అని నిహిలెంట్‌ హైపర్‌ కలెక్టివ్‌ అంతర్జాతీయ సీఈఓ కేవీ శ్రీధర్‌ తెలిపారు. హరీష్‌ బిజూర్‌ కన్సల్ట్స్‌ సీఈవో హరీష్‌ బిజూర్‌ స్పందిస్తూ.. ‘‘స్టార్స్‌లో ఈ ఐదుగురు మాత్రం మెగాస్టార్స్‌ కిందకు వస్తారు. వారికి ఉన్న ఆకర్షణ ఏమాత్రం చెక్కుచెదరదు. ఇది ప్రేక్షకులతో వారిని మరింత సన్నిహితం చేస్తోంది. బ్రాండ్లకు కావాల్సింది కూడా ఇదే’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు