రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్‌ గేట్స్

14 Dec, 2020 12:23 IST|Sakshi

కరోనా వైరస్‌ మరింత విజృంభించవచ్చు

మాస్కులు, తదితర జాగ్రత్తలు తప్పనిసరి

లేదంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశం

మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ హెచ్చరికలు

వాషింగ్టన్‌: రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్‌ మరిన్ని సవాళ్లు విసరవచ్చని గ్లోబల్‌ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ తాజాగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం వంటివి విధిగా చేయవలసి ఉన్నట్లు నొక్కి చెప్పారు. లేదంటే వైరస్‌ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలకు బిల్ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పరిశోధన, ఆర్థిక సహకారమందిస్తున్న సంగతి తెలిసిందే.  (ఇక యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌!)

మరో 2 లక్షల మంది
యూఎస్‌లో కోవిడ్‌-19 విలయానికి ఇప్పటివరకూ 2.9 లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచారు. అయితే ఇటీవల అదనంగా 2 లక్షల మంది మరణించే అవకాశమున్నట్లు ఆరోగ్య అంశాలను మదింపు చేసే ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఇదెంతో బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహచైర్మన్‌ బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. అయితే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర చర్యల ద్వారా వీటి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఇటీవల యూఎస్‌లో గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 

2015లోనే
వైరస్‌ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు వీలున్నట్లు 2015లో అంచనా వేసినప్పటికీ కోవిడ్‌-19 ఇంతకంటే అధిక నష్టాన్ని కలిగిస్తున్నట్లు బిల్ గేట్స్‌ పేర్కొన్నారు. నిజానికి ముందుముందు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. వైరస్‌ కారణంగా ఇటు యూఎస్‌.. అటు ప్రపంచంపై పడిన ఆర్థిక ప్రభావం ఆందోళనలు కలిగిస్తున్నట్లు చెప్పారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు