ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్‌వ్యవస్థీకరణ

15 Aug, 2022 04:02 IST|Sakshi

ప్రత్యేక చట్టానికి కేంద్రం శ్రీకారం

పలు ప్రోత్సాహకాలతో వాణిజ్య శాఖ సిద్ధం

న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్‌ఈజెడ్‌) పునర్‌ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్‌ఈజెడ్‌లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు.

ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ సర్వీస్‌ హబ్స్‌’’ (డీఈఎస్‌హెచ్‌)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ  స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్‌ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  

ప్రోత్సాహకాలు ఇవీ...
ఎస్‌ఈజెడ్‌లో ఒక యూనిట్‌ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్‌టీ (ఇంటిగ్రేడెట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్‌లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు,  దేశీయ టారిఫ్‌లకు సంబంధించి  ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం.

ప్రతిపాదిత డెవలప్‌మెంట్‌ హబ్‌లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం  కార్పొరేట్‌ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్‌లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.  

ఎకానమీలో కీలకపాత్ర...
దేశంలో ఎగుమతి కేంద్రాలు,  తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్‌ చట్టం రూపొందింది. 2022 జూన్‌ 30 నాటికి కేంద్రం  425 ఎస్‌ఈజెడ్‌ డెవలపర్‌లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా,  2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది.

మరిన్ని వార్తలు