LPG Cylinder Price Update: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్‌ ధర భారీ తగ్గింపు

1 Jun, 2022 11:08 IST|Sakshi

19-కిలోల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు 

జూన్ 1 నుండి  అమలులోకి

సాక్షి, న్యూఢిల్లీ: వరుస చార్జీల బాదుడుతో విలవిల్లాడిన కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ  సిలిండర్ ధరను రూ.135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చినట్టు  ఒక నోటిఫికేషన్‌లో తెలిపాయి. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండుసార్లు పెంచిన తర్వాత తాజాగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్లలో ధరల సవరణను ప్రకటించలేదు. 

తాజా సవరణతో హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో 19 కిలోల  వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 2,355.50 నుండి రూ. 2219కి తగ్గింది. ముంబైలో  2,307 నుండి 2171.50 రూపాయలకు దిగి వచ్చింది.  కోల్‌కతాలో రూ.2,455 ధరకు బదులుగా రూ.2,322 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.2,508 నుంచి రూ.2,373కి తగ్గింది. అయితే 14.2 కిలోల గృహోపకరణాల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. మరి భవిష్యత్తులో వంట గ్యాస్  ధర కూడా తగ్గించనున్నారా? అనేది  వేచి చూడాలి.

మరిన్ని వార్తలు