భారీగా పెరిగిన వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ ధర!

1 Aug, 2021 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు (ఆగస్టు 1) పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5 పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులేదు. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు పెరిగింది. కోల్ కతా, చెన్నైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు & గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. 

దేశీయ గృహ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను 2021 ఆగస్టులో మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. 2021లోనే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. ఉదాహరణకు, 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంది. అయితే, ఇన్ని సంవత్సరాల్లో నిరంతర ధరల పెరుగుదలతో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ.834.50 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు