కమోడిటీలకు రెక్కలు.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు చిక్కులు

23 Mar, 2022 02:00 IST|Sakshi

బ్యాటరీల తయారీ ముడి వస్తువుల రేట్ల పెరుగుదల 

భారీగా పెరిగిన లిథియం, నికెల్, కోబాల్ట్‌ ధరలు 

ప్రత్యామ్నాయాలపై కంపెనీల దృష్టి 

పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న లక్ష్యాలకు ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈవీల్లో కీలకమైన బ్యాటరీల తయారీకి సంబంధించిన ముడి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోవడం ఇందుకు కారణం. దీని వల్ల ఈవీల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు మరింత సమయం పట్టేయనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్, మాంగనీస్, నికెల్‌ వంటి ముడి వస్తువులను ఉపయోగిస్తారు.

ఈ ఏడాది తొలి నాళ్ల నుంచి మ్యాంగనీస్‌ మినహా మిగతా కమోడిటీల ధరలన్నీ ఒక్కసారిగా ఎగిశాయి. గణాంకాల ప్రకారం ప్రపంచంలో సరఫరా అయ్యే మొత్తం లిథియం వినియోగంలో నాలుగింట మూడొంతుల వాటా బ్యాటరీలదే ఉంటోంది. ఈవీల కొరత, ఉత్పత్తి పెంపు అంచనాల కారణంగా లిథియం రేట్లు గతేడాది నుంచే పరుగులు తీస్తున్నాయి. లిథియం ధరలకు ప్రామాణికమైన లిథియం కార్బొనేట్‌ ధరలు ఈ ఏడాది 75 శాతం పెరిగాయి. ప్రస్తు తం టన్ను రేటు 78,294 డాలర్ల స్థాయిలో ఉంది.  

కస్టమర్లపై భారం.. 
నికెల్, ఇంధనాల ధరల పెరుగుదల వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల తయారీ సంస్థలు, వాహన తయారీ సంస్థల వ్యయాలూ పెరుగుతాయని ఫిచ్‌ సొల్యూషన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారం అంతిమంగా వినియోగదారులకు బదిలీ అవుతుందని తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుండి ఇంధనాల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముడిచమురు, బొగ్గు, సహజ వాయువు, ఇథనాల్‌ మొదలైన వాటన్నింటి రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పరిస్థితులు అదుపులోకి రావచ్చన్న ఆశలతో ఆ తర్వాత కాస్త దిగివచ్చాయి. క్రూడాయిల్, సహజ వాయువు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా రష్యాపై ఆంక్షలు విధించడంతో ఇంధనాల సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో క్రూడాయిల్‌ రేట్లు ఎగిశాయి.

అటు గోధుమలు, బార్లీ, వంటనూనెల ధరలూ పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు రెండూ.. వీటిని అత్యధికంగా సరఫరా చేసే దేశాలు కావడం ఇందుకు కారణం. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, సరఫరా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు చాలా మటుకు దేశాలు లిథియం–నికెల్‌–మాంగనీస్‌–కోబాల్ట్‌ బ్యాటరీల ను ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగిస్తున్నాయి. కానీ చైనా ఈవీ మార్కెట్లో మాత్రం లిథియం అయాన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నికెల్‌ను పక్కన పెట్టి లిథియం–ఐరన్‌–ఫాస్ఫేట్‌ కాంబినేషన్‌తో ప్రత్యా మ్నాయ బ్యాటరీల తయారీపై ఆసక్తి పెరగవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అభిప్రాయపడింది.

నికెల్‌ @ 1 లక్ష డాలర్లు.. 
మరో కీలక కమోడిటీ నికెల్‌ రేట్లు గడిచిన మూడు వారాల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒక దశలో టన్నుకు 1,00,000 డాలర్లు పలికిన నికెల్‌ తర్వాత 45,000 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినా కూడా ఈ ఏడాది ప్రారంభం నాటి 20,995 డాలర్లతో పోలిస్తే ఇప్పటికీ రెట్టింపు స్థాయిలోనే ఉండటం గమనార్హం. రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశం నుండి కొనుగోళ్లు పడిపోయి.. ఈ ఏడాదంతా కూడా నికెల్‌ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నికెల్‌ సరఫరాలో రష్యాకు దాదాపు తొమ్మిది శాతం వాటా ఉంది. అటు కోబాల్ట్‌ 2021లో గణనీయంగా పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటిదాకా మరో 16 శాతం పెరిగింది. టన్నుకు 82,000 డాలర్లకు చేరింది. మాంగనీస్‌ ధరలు 2022లో మూడు శాతం పెరిగి టన్నుకు 5.43 డాలర్లకు చేరాయి. ఈ ధరలు అధిక స్థాయిలో అలాగే కొనసాగాయంటే హరిత వాహనాల వైపు మళ్లే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవీలకు డిమాండ్‌ భారీగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లిథియం ఉత్పత్తిని పెంచేందుకు మైనింగ్‌ కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం అమెరికాను మినహాయించి గతేడాది అంతర్జాతీయంగా లిథియం ఉత్పత్తి 21 శాతం పెరిగి 1,00,000 టన్నులకు చేరింది. రేట్లు పెరగడంతో వివిధ వనరుల ద్వారా ఉత్పత్తిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు