టూవీలర్స్‌కు ‘ఎలక్ట్రిక్‌’ కిక్‌..!

25 Aug, 2021 02:24 IST|Sakshi

భారీ హంగులతో ఓలా ఎంట్రీ 

ఇప్పటికే పదుల సంఖ్యలో కంపెనీలు 

ఏథెర్‌ ఎనర్జీ సైతం విస్తరణ 

ఇంకా రేసులోకి అడుగుపెట్టని హోండా, హీరో, యమహా 

బజాజ్, టీవీఎస్‌.. ఒక్కటే మోడల్‌ 

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌ (బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్‌లు) ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో ఉంది. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే.. పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు ఇటీవలి కాలంలో వేగాన్ని అందుకుంటున్నాయి. పరిణామక్రమాన్ని కొన్ని కంపెనీలు ముందుగానే పసిగట్టి పెద్ద అడుగులు వేయడానికి వెనుకాడడం లేదు. ఓలా కంపెనీ భారీ పెట్టుబడులతో, ఆధునిక ఫీచర్లతో రెండు స్కూటర్లను ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ విభాగంలో బెంగళూరు స్టార్టప్‌ ఏథెర్‌ బలంగా ఉంది.

ఇంకా పదుల సంఖ్యలో చిన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. కానీ, సంప్రదాయ (కంబస్టన్‌ ఇంజన్‌) విభాగంలోని దిగ్గజ కంపెనీలైన హోండా, హీరో మోటోకార్ప్, యమహా, సుజుకీ ఇంత వరకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయలేదు. టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో పేరుకు ఒక్కో మోడల్‌తో ఎంట్రీ ఇచ్చి వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఈ సంస్థలు కూడా పరిశోధన, అభివృద్ధితో ఆధునిక స్టార్టప్‌ కంపెనీలకు పోటీనిచ్చేలా మోడళ్లను ప్రవేశపెడితే ఈ మార్కెట్‌ మరింత వేడెక్కి, వేగాన్ని సంతరించుకోనుంది. కానీ, అదెప్పుడా అన్నదే ప్రశ్న? 

‘ఓలా’ విజయం నిర్ణయిస్తుంది.. 
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. వినియోగదారుల ఇష్టాన్ని గెలిచామా?’ అన్నదే వాహనాల విషయంలో ప్రామాణికం అవుతుంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంప్రదాయ వాహన కంపెనీలకు నెట్‌వర్క్‌ చాలా పటిష్టమైనది. విక్రయాలు, విక్రయానంతర సేవల విషయంలో భారీ పెట్టుబడుల అవసరం వీటికి ఉండదు. అయినా కానీ, ఈ కంపెనీల ధోరణి తొందరపాటు వద్దన్నట్టుగా ఉంది. స్కూటర్ల మార్కెట్‌ను 50 శాతం వాటాతో జపాన్‌కు చెందిన హోండా శాసిస్తోంది.

ఈ సంస్థ ఇంతవరకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై తన ప్రణాళికల గురించి నోరు మెదపలేదు. మరోవైపు ఓలా ఈ విభాగంలో బలంగా పాతుకుపోయే ప్రణాళికలతో వచ్చింది. ఏడాదికి 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో తమిళనాడులో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరుతో రెండు మోడళ్లను ఆవిష్కరించింది. అక్టోబర్‌ నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. మొదటి ఏడాదే 5 లక్షల వాహనాలను విక్రయించాలన్న లక్ష్యంతో దూకుడుగా వెళుతోంది. ఓలా ఎలక్ట్రిక్‌ ప్రణాళికల అమలు విజయం ఈ మార్కెట్‌కు కీలకం అవుతుందని జెఫరీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నీరజ్‌ మంగల్‌ అభిప్రాయపడ్డారు. ద్విచక్ర ఈవీ మార్కెట్లో ఓలా అడుగులు ఇప్పటికే ఉన్న కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా.. కొత్త సంస్థల ప్రవేశానికి సానుకూలతలను తీసుకురావచ్చని నిపుణుల అంచనాగా ఉంది.   

మార్పుకు సమయం పడుతుంది.. 
టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఐక్యూబ్‌’ ప్రతీ నెలా 1,000 యూనిట్ల విక్రయాలే నమోదవుతున్నాయి. బజాజ్‌ ఆటో ఈ–స్కూటర్‌ ‘చేతక్‌’ అయితే కేవలం 250–300 యూనిట్లే అమ్ముడుపోతున్నాయి. కానీ, ఈవీలకు సంబంధించి ఈ సంస్థలు ఇప్పటికీ భారీ ప్రణాళికలను ప్రకటించలేదు. ఏథెర్‌ తన విక్రయాల గణాంకాలను విడుదల చేయడం లేదు. ఈ సంస్థకు వార్షికంగా లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
‘‘కొత్తగా ఒక సంస్థ వచ్చిందన్న కారణంతో ప్రస్తుత మా ప్రణాళికలను సమీప కాలంలో మార్చుకునే ఉద్దేశం అయితే లేదు. మా ప్రణాళికలు యథావిధిగా కొనసాగుతాయి’’ అని బజాజ్‌ ఆటో ఈడీ రాకేశ్‌ శర్మ తెలిపారు. అచ్చమైన ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలతో పోలిస్తే సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలు నిదానంగా అడుగులు వేస్తుండడం అర్థం చేసుకోతగినదేనని నోమురా ఆటో రీసెర్చ్‌ హెడ్‌ హర‡్షవర్ధన్‌ శర్మ అన్నారు.

ప్రభుత్వాల మద్దతు..! 
ఫేమ్‌–2 పథకం (ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీలు) విషయమై అనిశ్చితి కొనసాగుతూ ఉండడం, కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూలతలు, చిప్‌లకు కొరత నెలకొనడం ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫేమ్‌ పథకం కింద కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో సబ్సిడీలు అందిస్తోంది. కాకపోతే ఈ సబ్సిడీలను ఇటీవలే మరింత పెంచింది. అదే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈవీ రాయితీలతో విధానాలను తీసుకొస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర ఈ విషయంలో ముందున్నాయి.  

మరిన్ని వార్తలు