ఐఫోన్‌ 12- 12 మినీ.. ఏది బెటర్‌?

19 Nov, 2020 10:15 IST|Sakshi

చిన్న డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం తక్కువ

కెమెరా, బ్రైట్‌నెస్‌ తదితర ప్రధాన ఫీచర్స్‌.. సేమ్

‌ధర రూ. 10,000 తక్కువ- బరువూ తక్కువే

12W ఫాస్ట్‌ చార్జర్‌, మాగ్‌సేఫ్‌ చార్జింగ్‌ సపోర్ట్‌

ముంబై, సాక్షి: యాపిల్‌ తయారీ ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 మినీ దేశీయంగా రూ. 10,000 ధరల తేడాతో లభిస్తున్నాయి. ఐఫోన్‌ 12 రూ. 79,900 నుంచి ప్రారంభంకాగా.. 12 మినీ రూ. 69,900 ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ప్రధానంగా డిస్‌ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం ప్రస్తావించవచ్చని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇతర అంశాలు చూద్దాం..

5.4 అంగుళాలు
ఐఫోన్‌ 12.. డిస్‌ప్లే 6.1 అంగుళాలుకాగా.. 12 మినీ 5.4 అంగుళాల తెరను కలిగి ఉంది. పూర్తి హెచ్‌డీ, సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేతో లభిస్తోంది. ఫ్రంట్‌ కెమెరా నాచ్‌, ఫేస్‌ ఐడీ సెన్సార్లను సైతం కలిగి ఉంది. 12 మినీ పరిమాణం తక్కువకావడంతో ఒంటి చేత్తో ఆపరేట్‌ చేయడం సులభంగా ఉంటుంది. అయితే ఐఫోన్‌ 5 Sతో పోలిస్తే పరిమాణంలో పెద్దదనే చెప్పాలి. కేవలం 135 గ్రాముల బరువుతో సౌకర్యంగా కూడా ఉంటుంది. 7.4 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండటంతో సులభంగా వినియోగించవచ్చు. గ్లాసీ బ్యాక్‌ కావడంతో చేతివేళ్ల మార్క్‌లకు ఆస్కారం తక్కువే. అయితే ఐఫోన్‌ 12తో పోలిస్తే పెద్ద స్క్రీన్‌పై టైపింగ్‌కు అలవాటుపడిన వారికి కొంతమేర అసౌకర్యంగా అనిపించవచ్చు. చదవండి: (ప్లూటన్‌తో విండోస్‌ పీసీ హ్యాకర్లకు చెక్‌)

12తో పోలిస్తే
12 మినీ చిన్న స్క్రిన్‌ను కలిగి ఉన్నప్పటికీ ఐఫోన్‌ 12 స్థాయిలో బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. హెచ్‌డీఆర్‌ కంటెంట్‌ విషయంలో 625 నుంచి 1200 నిట్స్‌వరకూ బ్రైట్‌నెస్‌ను ప్రతిబింబిస్తుంటుంది. వీడియో కంటెంట్‌ చూస్తున్నప్పుడు స్టీరియో స్పీకర్‌ కారణంగా ఆడియో సైతం స్పష్టంగా బిగ్గరగా వస్తుంది. 12 మినీలోనూ 5 ఎన్‌ఎం ఆధారిత A14 బయోనిక్‌ చిప్‌నే వినియోగించారు. 4 జీబీ ర్యామ్‌, ఐవోఎస్‌ 14 ద్వారా అత్యుత్తమ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందే వీలుంది. 64 GB అంతర్గత మెమొరీతో రూపొందింది. ఇక గేములు ఆడేటప్పుడు ఐఫోన్‌ 12తో పోలిస్తే 12 మినీ స్వల్పంగా వేడెక్కుతోంది. పరిమాణంరీత్యా ఇది ప్రస్తావించదగ్గ అంశంకాదు. ఇదేవిధంగా 12 మినీ 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్‌ చేస్తుందని యాపిల్‌ చెబుతోంది. అయితే ఐఫోన్‌ 12తో పోలిస్తే గేములు, వీడియో స్ట్రీమింగ్‌ విషయంలో బ్యాటరీ చార్జింగ్‌ తొందరగా కోల్పోయే అవకాశముంది. సగటు వినియోగదారునికి ఇది సమస్యకాకపోవచ్చు. 

ఫాస్ట్‌ చార్జర్‌
ఐఫోన్‌ 12 మినీ 18W చార్జర్‌తో గంటలోనే చార్జింగ్‌ పూర్తవుతుంది. కొత్త మాగ్‌సేఫ్‌ చార్జర్‌ సపోర్ట్‌ చేసినప్పటికీ 12W చార్జింగ్‌ సామర్థ్యానికే పరిమితం. ఐఫోన్‌ 12లో అయితే 15W చార్జింగ్‌కు వీలుంది. అంతేకాకుండా మాగ్‌సేఫ్‌ చార్జింగ్‌ వల్ల 12 మినీ కొంతమేర వేడెక్కుతోంది. ఈ చార్జర్‌ను రెండో ఆప్షన్‌గానే పరిగణించాలి. 12 మినీ బ్యాటరీ సామర్థ్యం 2227 ఎంఏహెచ్‌కాగా.. 2815 ఎంఏహెచ్‌ను ఐఫోన్‌ 12 కలిగి ఉంటుంది. ఇక వెనుకవైపు రెండు కెమెరాలు 12 ఎంపీ, వైడ్‌, అల్ట్రావైడ్‌ లెన్స్‌తో రూపొందాయి. ఫ్రంట్‌ కెమెరా సైతం 12 ఎంపీని కలిగి ఉంటుంది. వెరసి చాలా వరకూ రెండు ఫోన్లూ ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్క్రీన్‌ పరిమాణం, బ్యాటరీ విషయంలో మాత్రమే ఐఫోన్‌ 12 మినీ విభిన్నతను కలిగి ఉన్నట్లు స్మార్ట్‌ఫోన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు