-

సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం

5 Oct, 2022 08:27 IST|Sakshi

న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్‌ కమిషన్‌ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్‌పై వెల్లడించింది.

 వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్‌కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు తెలుస్తోంది. 

గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియాలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్‌ నెట్‌వర్క్‌ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్‌ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి.    

మరిన్ని వార్తలు