ఇకపై స్మార్ట్‌ ఫోన్‌లో టీవీ చూడొచ్చు..! ఎలా అంటే..?

19 Feb, 2023 19:55 IST|Sakshi

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ కార్యక్రమాలను వీక్షించేలా ట్రయల్స్‌ నిర్వహించనుంది. ఇదే విషయాన్ని సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారికంగా ప్రకటించారు. 

ఈ ఏడాది రేడియో స్టేషన్‌లను వేలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎఫ్‌ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ప్రసంగించారు.

పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ  దేశంలో 60 శాతం మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. సరిహద్దు, వ్యూహాత్మక ప్రాంతాలతో సహా ప్రసార భారతి పరిధిని విస్తృతం చేయడానికి ప్రసార మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బైండ్) స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 2,500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.  

ఈ పథకం దేశంలో ప్రభుత్వ రంగ ప్రసారాలను పెంచడం, ఆల్ ఇండియా రేడియో (air), దూరదర్శన్ (dd)తో సహా ప్రసార భారతి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు టెలివిజన్ సిగ్నల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు ప్రసారం చేసేలా పరిసర ప్రాంతాలలో ట్రాన్స్‌మిటర్‌లను ఇన్‌స్టాల్ చేసినట్లు చంద్ర చెప్పారు.

అత్యాధికమైన టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను సేకరించవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ పరికరాలకు ప్రత్యేక డాంగిల్‌ను జత చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫోన్‌లలో ప్రత్యేక చిప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా మొబైల్ తయారీదారులను ప్రోత్సహించాల్సి ఉంటుందని, తద్వారా డాంగిల్ లేకుండానే టెలివిజన్ సిగ్నల్స్ అందుతాయని అన్నారు.

మరిన్ని వార్తలు