ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు భారీ డిమాండ్‌, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!

4 Jun, 2022 06:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్‌ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఆఫీస్‌ పని చేసుకునేందుకు వీలుగా వర్క్‌ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్‌ చేస్తున్నాయి.

గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్‌ హాల్, ఇండోర్‌ గేమ్స్, గెస్ట్‌ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్‌ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్‌ వర్క్‌ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్‌ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్‌ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్‌ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్‌ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

► వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్‌ స్పేస్‌కు కూడా డిమాండ్‌ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్‌ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్‌లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్‌మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు.

గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్‌మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్‌ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్‌ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్‌ ఏర్పడింది.
     
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్‌ స్పేస్‌లలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.         
     
► గతంలో పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్‌ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్‌ విద్యార్థుల కోసం పికప్‌ డ్రాప్‌ కోసం వినియోగించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు