హైదర్‌గూడ డీ మార్ట్‌కి షాక్‌! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక

23 Jun, 2022 14:54 IST|Sakshi

కస్టమర్లతో వ్యవహరించే తీరులో డీ మార్ట్‌ యాజమాన్యం వైఖరి సరిగా లేదంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలంటూ తేల్చి చెప్పింది. నలభై ఐదు రోజుల్లోగా ఈ పరిహారం అందివ్వకపోతే ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

దేశంలోనే నంబర్‌ వన్‌ రిటైల్‌ స్టోర్‌గా డీ మార్ట్‌ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. వస్తువులు కొనడం కంటే బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరే ఎక్కువగా  వేచి చూడాల్సినంత బిజీగా డీ మార్ట్‌ స్టోర్లు ఉంటాయి. అయితే బిల్లింగ్‌ పూర్తయిన తర్వాత సంచి లేకపోతే డీమార్ట్‌ వాళ్లే అక్కడ క్యారీ బ్యాగ్‌ను అందిస్తారు. ఇలా క్యారీ బ్యాగ్‌ అందించే విషయంలో చెలరేగిన వివాదంపై తాజాగా తీర్పును ప్రకటించింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.

నగరంలోని హైదర్‌గూడలో ఉన్న డీమార్ట్‌ స్టోరులో 2019 నర్సింహ మూర్తి అనే వ్యక్తి రూ.479 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. బిల్లింగ్‌ సమయంలో ఆ సామన్లు పట్టుకెళ్లేందుకు డీమార్ట్‌ లోగో ముద్రించి ఉన్న క్యారీ బ్యాగ్‌ను అందించారు. అయితే డీమార్ట్‌ లోగోతో ఉన్న క్యారీ బ్యాగుకు రూ.3.50 ఛార్జ్‌ చేస్తూ బిల్లులో దాన్ని చేర్చారు. క్యారీబ్యాగుకి రూ.3.50 ఛార్జ్‌ చేయడాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఎదుటకు తీసుకెళ్లాడు నర్సింహ మూర్తి.

ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డీమార్ట్‌ను తప్పు పట్టింది. కస్టమర్లకు అందించే బ్యాగులకు ఛార్జ్‌ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. కస్టమర్లకు బ్యాగులు అందించినందుకు ఛార్జ్‌ వసూలు చేయొద్దంటూ తేల్చి చెప్పింది. బాధితుడికి పరిహారంగా రూ.10,000 ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నలభై ఐదు రోజుల్లోగా పరిహాం ఇవ్వకపోతే ఆలస్యం జరిగిన కాలానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది.
 

చదవండి: 'వాణిజ్య భవన్‌'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

మరిన్ని వార్తలు