ఇకపై కన్జూమర్‌ గూడ్స్‌, సిమెంట్‌ స్పీడ్‌

10 Oct, 2020 12:32 IST|Sakshi

దీర్ఘకాలానికి స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం ఆకర్షణీయం

భవిష్యత్‌లో మరిన్ని కంపెనీల నుంచి పబ్లిక్‌ ఇష్యూలు

-జ్యోతి రాయ్‌, ఈక్విటీ వ్యూహకర్త, ఏంజెల్‌ బ్రోకింగ్

కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్‌ డ్యురబుల్స్‌, సిమెంట్‌ రంగాలకు డిమాండ్‌ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్‌ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

మార్కెట్లు బలపడొచ్చు
మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్‌ చేయడం ద్వారా కోవిడ్‌-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్‌-19  కట్టడికి వ్యాక్సిన్‌ ఆలస్యంకావచ్చు. యూఎస్‌ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది.

ఐపీవోల జోరు
గత మూడు నెలల్లోనే 10 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టాయి. దీంతో రానున్న కాలంలో ప్రైమరీ మార్కెట్‌ వెలుగులో నిలవనుంది. ఇందుకు జోరుమీదున్న స్టాక్‌ మార్కెట్లు సహకరించనున్నాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం స్వల్ప కాలంలో అంత జోరు చూపకపోవచ్చు. పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా లాభపడటమే దీనికి కారణం. అయితే దీర్ఘకాలంలో ఈ రంగంపట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ రంగంలో అతుల్‌, పీఐ ఇండస్ట్రీస్‌, గలాక్సీ సర్ఫక్టాంట్స్‌ను పరిశీలించవచ్చు.

క్యూ2పై అంచనాలు
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆటో, సిమెంట్‌, ఐటీ, ఫార్మా, కెమికల్స్‌ రంగాలు పటిష్ట పనితీరు చూపే అవకాశముంది. వివిధ కంపెనీలు ప్రకటించే భవిష్యత్‌ ఆర్జన అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. ప్రస్తుతం పండుగల సీజన్‌ కారణంగా స్వల్ప కాలంలో డిమాండ్‌ పుంజుకోవచ్చు.

మరిన్ని వార్తలు