Consumer Durables Prices Hike: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..

13 May, 2022 11:37 IST|Sakshi

కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మరింత ప్రియం 

మరో విడత 3–5 శాతం పెంపు 

తయారీ వ్యయాలు పెరిగినందునే 

క్షీణిస్తున్న రూపాయి విలువ

విడిభాగాలపై అధిక వ్యయాలు 

చైనాలో లాక్‌డౌన్‌లతో నిలిచిన సరఫరా 

న్యూఢిల్లీ: టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ నెల చివరి నాటికి లేదంటే జూన్‌ మొదటి వారంలో ధరలను 3 నుంచి 5 శాతం మేర పెంచనున్నట్టు కంపెనీల వర్గాలు తెలిపాయి. తయారీ వ్యయాలు పెరిగిపోవడం కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపిస్తోంది. వీటి తయారీకి కొన్ని విడిభాగాలను ఆయా కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి విలువ క్షీణత కారణంగా ఈ దిగుమతుల వ్యయాలు ఇప్పుడు కంపెనీలకు భారంగా మారాయి. కీలక విడిభాగాల్లో ఎక్కువ వాటి కోసం కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చైనా వీటిని సరఫరా చేస్తుంటుంది. చైనాలో కరోనా వైరస్‌ కేసుల నియంత్రణకు కఠిన లాక్‌డౌన్‌లు అమలవుతున్నాయి. దీంతో షాంఘై పోర్ట్‌లో భారత్‌కు రావాల్సిన కంటెయినర్లు పేరుకుపోయాయి. ఫలితంగా విడిభాగాల కొరత కూడా నెలకొని ఉంది. ఈ పరిణామాలతో తయారీదారుల వద్ద తగినన్ని నిల్వలు ఉండడం లేదు. తయారీలో అధిక శాతం విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభించని పరిస్థితి నెలకొందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  

రూపాయి నొప్పి.. 
డాలర్‌తో రూపాయి విలువ మరింత క్షీణించడం తమకు సమస్యగా మారినట్టు కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) చెబుతోంది. ‘‘తయారీ ముడి పదార్థాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు యూఎస్‌ డాలర్‌ పెరుగుతూ పోతుంటే రూపాయి తగ్గుతోంది. తయారీదారులు అందరూ ఇప్పుడు తమ లాభాలపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జూన్‌ నుంచి ధరలు 3–5 శాతం మేర పెరుగుతాయి’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల, వాషింగ్‌ మెషిన్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఏసీల తయారీ సంస్థలు మే నెలలో ఇప్పటికే ధరలను పెంచాయి. మరి కొన్ని కంపెనీలు మే చివరికి లేదా జూన్‌ మొదట్లో ధరలను పెంచాలనుకుంటున్నాయి.  

రూపాయి కోలుకుంటే..? 
‘‘దిగుమతి చేసుకునే విడిభాగాలకు చెల్లింపులు చేయడం త్వరలోనే మొదలు కానుంది. డాలర్‌ కనుక రూపాయితో 77.40 స్థాయిలోనే ఉంటే మేము కచ్చితంగా ధరలను సవరించుకోక తప్పదు. ఒకవేళ యూఎస్‌ డాలర్‌ వచ్చే రెండు వారాల్లో కనుక తిరిగి 75 వద్ద స్థిరపడితే ధరల్లో సర్దుబాటు చేయబోము’’అని ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. తయారీ వ్యయాలపై ఒత్తిడులు కొనసాగూనే ఉన్నట్టు ప్యానాసోనిక్‌ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీష్‌ శర్మ తెలిపారు. ఈ భారం కస్టమర్లపై పరిమితంగా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ‘‘చివరిగా 2022 జనవరిలో రేట్లను పెంచాం. కమోడిటీల ధరలు పెరగడంతో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు ఇలా అన్ని విభాగాల్లోని ఉత్పత్తులపై మరో 3–5 శాతం మేర ధరలు ప్రియం కావచ్చు’’అని మనీష్‌ శర్మ వివరించారు. బ్లౌపంక్ట్, థామ్సన్, కొడాక్, వైట్‌ వెస్టింగ్‌హౌస్‌ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల లైసెన్సింగ్‌ కలిగిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (ఎస్‌పీపీఎల్‌) సైతం టీవీ ఉత్పత్తులపై ధరలు పెరుగుతాయని ధ్రువీకరించింది. ‘‘2022లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధం మొదలుకొని, కరోనా కారణంగా చైనాలో లాక్‌డౌన్‌లు, ఇప్పుడు యూఎస్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వరకు.. వీటి కారణంగా బ్రాండ్లు తమ ఉత్పత్తుల తయారీకి కావాల్సిన విడిభాగాలను సమీకరించుకోవడం సమస్యగా మారింది’’అని ఎస్‌పీపీఎల్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు. తయారీ వ్యయాలు 20 శాతం పెరిగాయని, జూన్, జూలై నెలల్లో తమ ఉత్పత్తులపై 3–5 శాతం స్థాయిలో ధరలను పెంచనున్నట్టు చెప్పారు. హయ్యర్‌ అప్లయనెన్స్‌ ఇండియా (చైనా సంస్థ) ప్రెసిడెంట్‌ సతీష్‌ ఎన్‌ఎస్‌ సైతం.. షాంఘై లాక్‌డౌన్‌ వల్ల విడిభాగాలకు సమస్య ఏర్పడినట్టు చెప్పారు. ఏసీలు, ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, రిఫ్రిజిరేటర్లపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు.  

చదవండి: దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..

మరిన్ని వార్తలు