కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!

9 Jan, 2022 19:13 IST|Sakshi

కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్​ కండీషనర్స్​, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్​ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి.

పానాసోనిక్, ఎల్​జీ, హయర్​ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు.

ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్​ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్​ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్​జీ తెలిపింది.

(చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!)

మరిన్ని వార్తలు