కట్టడిలోకి రిటైల్‌ ద్రవ్యోల్బణం

13 Aug, 2021 02:01 IST|Sakshi

జూలైలో 5.59 శాతం ∙రెండు నెలల గరిష్టం నుంచి కిందకు...

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో అదుపులోనికి వచ్చింది. 5.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూలైలో పోల్చితే 2021 జూలైలో రిటైల్‌ ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 5.59 శాతం పెరిగిందన్నమాట. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేటు–రెపోకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (ఆర్‌బీఐకి) ప్రకారం 2 నుంచి 6శాతం శ్రేణిలో ఉండాలి. అయితే మే, జూన్‌ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలుగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది.

ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతం ఉంటే, జూలైలో 3.96 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల చూస్తే జూన్‌లో 0.7 శాతం తగ్గితే, జూలైలో ఈ తగ్గుదల ఏకంగా 7.75 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు ఇదే కాలంలో 10.01% నుంచి 9.04%కి దిగివచ్చాయి. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ప్రొటీన్‌ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆయిల్‌ ఫ్యాట్స్‌ ధరలు 32.53% పెరిగాయి. అయితే జూలైలో ఈ పెరుగుదల రేటు 35%గా ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు