రేట్లు రయ్‌ రయ్‌..దేశంలో కనుమరుగు కానున్న శిలాజ ఇంధనాల వినియోగం!

31 Mar, 2022 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ:  పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తమ వ్యయ శక్తి గణనీయంగా పడిపోతోందని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ (శిలాజ) ఇంధన వనరుల వినియోగం నుంచి తమ దేశాలు వేగంగా వైదొలగడమే మంచిదని కోరుకుంటున్నారు. ఈ మేరకు డిమాండ్‌ చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌–ఇప్సోస్‌ మొత్తం 30 దేశాల్లో 22,534 మంది  అభిప్రాయాలను స్వీకరించి ఈ నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య జరిగిన సర్వేలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

 ప్రతి పది మందిలో సగటున ఎనిమిది మంది వచ్చే ఐదేళ్లలో తమ దేశం శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.  భారత్‌ దేశానికి సంబంధించి సర్వేలో పాల్గొన్న వారి విషయంలో ఈ నిష్పత్తి దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉంది.
 
  84 శాతం మంది తమ స్వంత దేశం  స్థిరమైన ఇంధన వనరులకు మారాలని సూచించారు.
 
  ధరల పెరుగుదలకు తమ ప్రభుత్వాల వాతావరణ విధానాలే కారణమని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు.
 
► రోజువారీ ఖర్చుల్లో ఏ విభాగం కొనుగోలు శక్తిని భారీగా దెబ్బతీస్తోందన్న అంశంపై సర్వే దృష్టి సారించింది. ఇంధనం, రవాణా, ఎయిర్‌ కండీషనింగ్, వంట, విద్యుత్‌ ఉపకరణాల వినియోగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సగటున  30 దేశాలలో సగానికి పైగా వినియోగదారులు (55 శాతం) ఇంధన ధరల పెరుగుదల వల్లే తమ కొనుగోలు శక్తి గణనీయంగా ప్రభావితమవుతోందని తెలిపారు. అయితే దేశాల వారీగా ఈ శాతం విభిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా విషయంలో ఈ రేటు 77 శాతం ఉంటే, జపాన్, టర్కీ విషయంలో 69 శాతంగా ఉంది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఈ శాతం తక్కువ స్థాయి లో 37 శాతంగా ఉంది. భారత్‌కు సంబంధించి 63 శాతంగా నమోదయ్యింది. భారత్‌ రెస్పాండెంట్లలో 63 శాతం మంది తాము ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.  

 ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు కూడా విభిన్నంగా ఉండడం గమనార్హం.  

   చమురు, గ్యాస్‌ మార్కెట్లలో అస్థిరత దీనికి కారణమని 28 శాతం మంది అభిప్రాయపడితే,  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణాన్ని 25 శాతం మంది పేర్కొన్నారు. మరో 18 శాతం మంది పెరిగిన డిమాండ్, సరఫరాల సమస్య కారణమని పేర్కొన్నారు. 16 శాతం మంది తమకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. 13 శాతం మంది మాత్రమే తమ ప్రభుత్వాల  వాతావరణ మార్పు విధానాలను నిందించారు. దేశాల వారీగా సర్వేలో పాల్గొన్న వారిలో ఈ శాతాన్ని పరిశీలిస్తే భారత్‌ 24 శాతంలో ఉండగా, జర్మనీ, పోలాండ్‌లలో వరుసగా 20 శాతం, 19 శాతాలుగా నమోదయ్యాయి. 

   ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాతావరణ విధానాలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఏ దేశంలోనూ మెజారీటీ రెస్పాండెంట్లు పేర్కొనలేదు. భారత దేశంలో సర్వేలో పాల్గొన్నవారు ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం చమురు, గ్యాస్‌ మార్కెట్‌ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లేనని అభిప్రాయపడ్డారు. తరు వాతి స్థానంలో సరఫరాలు తగినంతగా లేకపోవడం, ప్రభుత్వాలు అనుసరిస్తునన వాతావరణ మార్పు విధానాలు దీనికి కారణంగా ఉన్నాయి.  

    రాబోయే ఐదేళ్లలో  శిలాజ ఇంధనాల నుండి మరింత వాతావరణ అనుకూలమైన–స్థిరమైన ఇంధన వనరులకు దేశాలు మారడం ఎంత ముఖ్యమన్న విషయంపై ప్రధాన ప్రశ్నను సంధించడం జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా సర్వే లో పాల్గొన్న వారిలో 84 శాతం మంది (సగటున ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది) ఇది తమకు ఎంతో కీలకమని చెప్పారు. ఈ విషయంలో రష్యాలో అతి తక్కువగా 72 శాతంతో ఉంది. అమెరికాలో ఈ రేటు 75 శాతం ఉండగా, భారత్‌ విషయంలో 89 శాతం. దక్షిణాఫ్రికా,  పెరూలో 93 శాతం మంది దీనికి అనుకూలంగా వోటు వేశారు.  అభివృద్ధి చెందుతున్న దేశాల  ప్రజలు ప్రధానంగా ఈ డిమాండ్‌ చేస్తున్నారు.  

 శిలాజ ఇంధనాల నుంచి దూరంగా జరగాలని భావిస్తున్న వారిలో పురుషుల కంటే (81%) మహిళలు (87%) అధికంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు