కాంట్రాక్టు ఉద్యోగాలకు డిమాండ్‌ 

19 Oct, 2020 07:54 IST|Sakshi

 కరోనా వైరస్‌ ప్రభావం 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగార్థులు .. క్రమంగా కాంట్రాక్టు ఉద్యోగాల వైపు మొగ్గు చూపడం పెరుగుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇది ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటోందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ నైపుణ్యాలు అవసరమైన సేవల నుంచి అత్యంత నైపుణ్యాలు అవసరముండే సర్వీసుల దాకా ఇది విస్తరిస్తోందని వివరించారు. ‘కాంట్రాక్టు (తాత్కాలిక) ఉద్యోగాల విధానం చాలాకాలంగా ఉన్నప్పటికీ భారత్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఇది ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇటు ఆర్థిక, అటు కరోనా వైరస్‌ పరిస్థితులు ఇందుకు కారణం‘ అని టీమ్‌లీజ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కౌశిక్‌ బెనర్జీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇలాంటి వర్కర్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్లు వివరించారు. డెలివరీ ఏజెంట్లు, వేర్‌హౌస్‌ హెల్పర్లు, అసెంబ్లీ లైన్‌ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక వైట్‌–కాలర్‌ ఉద్యోగాలకు సంబంధించి డిజైనర్లు, కంటెంట్‌ రైటర్లు, డిజిటల్‌ మార్కెటర్లకు డిమాండ్‌ ఉన్నట్లు బెనర్జీ వివరించారు.  

మరిన్ని వార్తలు