‘ఏం తమాషాగా ఉందా?..’ అమెజాన్‌పై హెచ్‌జేసీ ఫైర్‌, మోదీకి చిరువ్యాపారుల రిక్వెస్ట్‌

19 Oct, 2021 08:06 IST|Sakshi
యూఎస్‌ హౌజ్‌ జ్యుడీషియరీ కమిటీ విచారణ సందర్భంగా జెఫ్‌ బెజోస్‌(పాత చిత్రం)

Reuters Allegations On Amazon's Business Practices: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు మొట్టికాయలు గట్టిగానే పడ్డాయి. ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై  ఐదుగురు చట్టసభ్యుల యూఎస్‌ హౌజ్‌ జ్యుడీషియరీ కమిటీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం కంపెనీని హెచ్చరిస్తూ ఘాటుగా ఓ లేఖను రాసింది సదరు కమిటీ. 


అమెజాన్‌ అనైతిక వ్యాపారధోరణిపై రాయిటర్స్‌ తాజా సంచలన కథనం మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో కంపెనీలో పని చేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తులు, చివరికి వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సహా అంతా పార్లమెంట్‌(అమెరికా కాంగ్రెస్‌)ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసి ఉంటారని, అబ్దదాలు సైతం చెప్పారంటూ యూఎస్‌ హౌజ్‌ జ్యుడీషియరీ కమిటీ తన లేఖలో పేర్కొంది.  అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ జరపిస్తామని అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీని ఉద్దేశిస్తూ ఓ లేఖలో ప్యానెల్‌ స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునే విషయంలో అమెజాన్‌ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ రాయిటర్స్‌ ఒక ఇన్వెస్టిగేషన్‌ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. గత బుధవారం ఆ కథనం ప్రచురితం కాగా..  ఈ సంచలన కథనం ఆధారంగా స్పందించిన దర్యాప్తు కమిటీ అమెజాన్‌ను పరోక్ష హెచ్చరికగా లేఖను రాసింది. 

స్థానిక ఉత్పత్తులను కాపీ కొట్టి ప్రొడక్టులు తయారుచేసుకోవడంతో పాటు, భారత్‌లాంటి దేశాల్లో అమెజాన్‌ ఇండియా యాప్‌ ద్వారా స్థానిక ఉత్పత్తులను తొక్కిపడేస్తూ, తమ ప్రొడక్టులను.. తమ అనుకూల ఉత్పత్తులనే ఎక్కువగా ప్రమోట్‌ చేస్తోందంటూ అమెజాన్‌పై రాయిటర్స్‌ తన కథనంలో ఆరోపించింది. మరోవైపు భారత్‌లోనూ ఈ కథనం ఆధారంగా అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు లక్షల మంది సంప్రదాయ వ్యాపారుల తరపున బృందం.. అమెజాన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి లేఖను సైతం రాసింది.

ఇదిలా ఉంటే గతంలోనూ అమెజాన్‌పై ఇదే తరహా ఆరోపణలు రాగా.. ఈ ఐదుగురు సభ్యుల హౌజ్‌ జ్యుడీషియరీ కమిటీ 2019 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆరోపణలు రావడంతో అప్పుడు సీఈవోగా ఉన్న జెఫ్‌ బెజోస్‌ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించింది ప్యానెల్‌. అయితే తాము ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం లేదంటూ ఆ టైంలో అంతా వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు రావడంతో క్రిమినల్‌ దర్యాప్తు తప్పదని హెచ్చరించింది విచారణ కమిటీ. అయితే తామెప్పుడూ కమిటీని తప్పుడు దోవ పట్టించలేదని, మీడియా కథనాలే తప్పుల తడకగా ఉన్నాయని వివరించామని ఓ ప్రతినిధి వెల్లడించారు.

చదవండి: బెజోస్‌కు ఆ ఆనందం లేకుండా చేసిన ఎలన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు