పండుగ సేల్స్‌ అదుర్స్‌

26 Nov, 2020 13:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో జోరుగా సాగాయి. 2019తో పోలిస్తే 2020 పండుగ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదైందని క్రెడిట్, పేమెంట్‌ స్టార్టప్‌ స్లైస్‌ తెలిపింది. 74 శాతం లావాదేవీలు డిజిటల్‌ రూపంలో, 26 శాతం ఆఫ్‌లైన్‌లో జరిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో 71 శాతం మంది నెలవారి వాయిదా (ఈఎంఐ) వినియోగించారు. గతేడాది ఈఎంఐ వాటా 58 శాతంగా ఉంది. నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌కు యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగటున నాలుగు నెలల ఈఎంఐ వ్యవధి కాలాన్ని ఎంచుకున్నారని సర్వే తెలిపింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 2 లక్షల మంది యంగ్‌ ఇండియన్స్‌ వ్యయ సరళిని విశ్లేషించింది. 

సెప్టెంబర్‌ నెలలో యంగ్‌స్టర్స్‌ ఖర్చు ఎక్కువగా చేశారని, ఇది కోవిడ్‌ ముందు కంటే ఎక్కువగా జరిగాయని స్లైస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాజన్‌ బజాజ్‌ తెలిపారు. ప్రతి కస్టమర్‌ లావాదేవీలో 150 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. స్లైస్‌ మొత్తం లావాదేవీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కలిపి 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎన్నాడు లేనంతగా ఈ ఏడాది పండుగ సీజన్‌లో స్లైస్‌లో అత్యధిక లావాదేవీ పరిమాణాన్ని చూశామని ఆయన చెప్పారు. అమెజాన్‌లో 60 శాతం మంది వినియోగదారులు, 40 శాతం మంది ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేశారని తెలిపారు. మింత్ర, జబాంగ్‌ వంటి ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌తో కలిపి చూస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య వరుసగా 45, 55 శాతం వినియోగదారులు షాపింగ్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు