లాక్‌డౌన్‌ సుదీర్ఘకాలం కొనసాగితే వాటికి కష్టమే

18 May, 2021 00:38 IST|Sakshi

కంపెనీల రికవరీకి కోవిడ్‌ గండం

డిమాండ్‌ పడిపోవచ్చు.. ఆదాయాలకు బ్రేక్‌ పడొచ్చు 

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఫస్ట్‌ వేవ్‌ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కంపెనీలకు తాజా సెకండ్‌ వేవ్‌ మరో సమస్యగా మారుతోంది. ఇది సత్వరం అదుపులోకి వస్తే ఫర్వాలేదు .. లేకపోతే సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన పక్షంలో వ్యాపార సంస్థల ఆదాయాల రికవరీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్న నేపథ్యంలో తాము రేటింగ్‌ ఇస్తున్న సంస్థల ఆదాయాల రికవరీ ప్రక్రియకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలించడం మొదలయ్యాక 2020 అక్టోబర్‌ తర్వాత వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. కానీ పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షల విధింపుతో ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్‌ బలహీనపడవచ్చని, ఇటీవలి రికవరీని దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. ‘కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కట్టడికి భారత్‌లో ప్రాంతీయంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లు మరీ అంత కఠినంగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకానైతే ఆర్థిక కార్యకలాపాలపై పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉంది. అయితే, వైరస్‌ వ్యాప్తి తగ్గి, పరిస్థితులు అదుపులోకి రాకపోయిన పక్షంలో..లాక్‌డౌన్‌లను మరింతగా పొడిగించాల్సి రావచ్చు.ఇంకా విస్తృతం చేయాల్సి కూడా రావచ్చు. ఇది మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చు‘ అని వివరించింది. 


జూన్‌ క్వార్టర్‌ కాస్త ఓకే.. 
జూన్‌ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని మూడీస్‌ అంచనా వేసింది. కానీ పరిస్థితి దిగజారితే మాత్రం కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని వివరించింది. ‘ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. కానీ వీటితో పోలిస్తే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే యావత్‌దేశంలో కార్యకలాపాలు దెబ్బతింటాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తే వ్యక్తుల రాకపోకలపై భారీ స్థాయిలో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్‌ పడిపోతుంది. అలాగే సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడతాయి. కార్మికుల కొరత సమస్య తీవ్రమవుతుంది‘ అని మూడీస్‌ తెలిపింది.

ఆటో, రియల్టీపై ప్రభావం.. 
కదలికలపై ఆంక్షల కారణంగా రవాణా ఇంధనానికి డిమాండ్‌ తగ్గిపోతుందని, చమురు రిఫైనర్ల ఉత్పత్తి పడిపోవచ్చని వివరించింది. అలాగే, పలు ఆంక్షల కారణంగా వినియోగదారులు .. కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకోవడం వల్ల్‌ ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో డిమాండ్‌ క్షీణిస్తుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ తగ్గడం వల్ల ఉక్కు, సిమెంట్, మెటల్స్, మైనింగ్‌ వంటి భారీ పరిశ్రమలకు చెందిన కంపెనీలు తమ పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి చేయలేకపోతాయని మూడీస్‌ తెలిపింది. విస్తృతంగా, సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌లు విధిస్తే వినియోగదారుల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని, వస్తు.. సేవలకు డిమాండ్‌ బలహీనపడుతుందని పేర్కొంది. నిత్యావసరయేతర కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకుంటారని.. ఫలితంగా దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయని వివరించింది. లాక్‌డౌన్‌లను కఠినంగా అమలు చేస్తే కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని, దీంతో తయారీ కార్యకలాపాలు నిల్చిపోతాయని మూడీస్‌ తెలిపింది. ఫలితంగా ఆంక్షలు సడలి, తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కూడా వారాలు, నెలల పాటు ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చని మూడీస్‌ తెలిపింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు