వ్యాక్సిన్, క్యూ3 ఫలితాలే కీలకం

4 Jan, 2021 05:47 IST|Sakshi

బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగే అవకాశం

జనవరి 8 నుంచి ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభం

వ్యాక్సినేషన్‌ చర్యలపై దృష్టి 

మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహక చర్యలు, కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక(ఆక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల ప్రకటన, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి వంటి కీలక అంశాలు ఈ వారంలో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నా యని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్‌ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 296 పాయింట్లను ఆర్జించడమే కాకుండా సాంకేతికంగా కీలకమైన 14,000 స్థాయిపైన ముగిసింది. ఈ సూచీలకిది వరుసగా పదోవారమూ లాభాల ముగింపు. మార్కెట్లో బుల్‌ రన్‌కు అనువైన పరిస్థితులు నెలకొనడంతో కొంతకాలం పాటు సూచీల అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చని జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ హెడ్‌ రీసెర్చ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే అప్‌ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టీ 14,300 స్థాయిని, తదుపరి 14,400 స్థాయిని అధిగమించే అవకాశం ఉందన్నారు. డౌన్‌సైడ్‌లో 13,800 స్థాయి వద్ద, 13,700 స్థాయిల వద్ద మద్దతున్నట్లు నాయర్‌ వివరించారు.

ఆర్థిక ఫలితాల ప్రభావం...  
ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ జనవరి 8 న క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటించి ‘‘కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల సీజన్‌’’కు తెరతీయనుంది. టీసీఎస్‌తో పాటు కొన్ని చిన్న ఐటీ, బ్యాంకింగ్‌ కంపెనీలు తమ మూడో క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల షేర్లు ఈ వారంలో అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక గణాంకాలు మెప్పించగలిగితే మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగవచ్చు.  

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృష్టి...  
భారత్‌లో కరోనా కట్టడికి కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల వినియోగానికి గతవారంలో డీసీజీఐ నుంచి అనుమతులు వచ్చేశాయి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై పరిశీలనకు కేంద్రం దేశవ్యాప్తంగా డ్రైరన్‌ విజయవంతంగా నిర్వహించింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 6 నుంచి దేశంలో వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.  

ఆర్థిక గణాంకాలు కీలకమే...  
గతేడాది డిసెంబర్‌ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండియా (పీఎంఐ) గణాంకాలు జనవరి 4న, అలాగే జనవరి 6న ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ గణాంకాలు విడుదలకానున్నాయి.

బుల్లిష్‌ ట్రెండే..
జీఎస్‌టీ అమలు నాటి నుంచి ఈ డిసెంబర్‌లో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లు జరగడం ఇదే తొలిసారని  ఆర్థిక శాఖ తెలిపింది. డిసెంబర్‌లో వాహన విక్రయాలు పెరిగినట్లు ఆటో కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్‌కు సానుకూల సంకేతాలు అందినట్లైంది. అమెరికా మార్కెట్లు కూడా గతవారం చివరి రోజున గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ పరిణామాల దృష్ట్యా  ఈ వారమూ మార్కెట్లో పాజిటివ్‌ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు