మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్‌!

12 Aug, 2021 11:56 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది.

సాక్షి, వెబ్‌డెస్క్‌: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్‌ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ప్రైవేటు రంగంలో కోచింగ్‌ సెంటర్లు
ఒలింపిక్‌ క్రీడల్లో అథ్లెటిక్స్‌ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్‌ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్‌డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్‌ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్‌స్పైర్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఐఐఎస్‌)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్‌ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్‌ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్‌ గ్రూప్‌, ఇండస్‌ఇండ్‌, సిటీబ్యాంక్‌, బ్రిడ్జిస్టోన్‌, బోరోసిల్‌ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్‌ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి‍్యూట్‌గా ఐఐఎస్‌ పేరు మార్మోగిపోతుంది.

పెరుగుతున్న ఫండింగ్‌
ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్‌ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌ ఎండీ పార్థ్‌ జిందాల్‌ ప్రకటించారు.  తమలాగే రిలయన్స్‌, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్‌ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. 

కంపెనీలకు అవసరమే
మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్‌ ఎక్కువ. బ్రాండ్‌ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్‌ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్‌ స్సాన్సర్‌షిప్‌, ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార​‍్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్‌ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్‌ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్‌ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్‌ చేసేందుకు ఒలింపిక్‌ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్‌ కంపెనీ చర్చలు ప్రారంభించింది.

పీపీపీ మోడ్‌
ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్‌, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్‌షిప్‌ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్‌, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్‌ స్పాన్సర్‌ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్‌ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్‌ స్పోర్ట్స్‌ హెడ్‌ వినీల్‌ కార్నిక్‌ తెలిపారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు