అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు

15 Sep, 2023 01:29 IST|Sakshi

ఆర్థిక సేవల కార్యదర్శి అజయ్‌సేత్‌

ముంబై: కార్పొరేట్‌ పన్ను, ఎక్సైజ్‌ పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌సేత్‌ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లో రెండో అతి పెద్ద వాటా కలిగిన కార్పొరేట్‌ పన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్‌–జూలై) 10.4 శాతం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 14 శాతం తగ్గడంపై వస్తున్న ఆందోళలను సేత్‌ తోసిపుచ్చారు. పన్నుల వసూళ్లను దీర్ఘకాలానికి చూడాలని సూచించారు. ‘‘కేవలం కొన్ని నెలల డేటా చూసి, దీర్ఘకాల ధోరణిని అంచనా వేయకూడదు.

కనీసం మరో త్రైమాసికం వేచి చూసిన తర్వాత దీర్ఘకాలంపై అంచనాకు రావాలి. బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు ఉంటాయన్నది నా ఉద్దేశ్యం’’అని వివరించారు. ఎస్‌ఎంఈ రుణాలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సేత్‌ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఏప్రిల్‌–జూలై కాలానికి స్థూల పన్నుల ఆదాయం రూ.8.94 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.8 శాతం అధికం. 2023–24 సంవత్సరానికి రూ.33.61 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పేర్కొనడం గమనార్హం. 

మరిన్ని వార్తలు