అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్‌ కార్పెట్‌: ఉద్యోగాలు పెరుగుతాయి!

21 Jun, 2022 11:05 IST|Sakshi

 అగ్నిపథ్‌కు ఆనంద్‌ మహీంద్రా, హర్ష్‌ గోయెంకా తదితరుల మద్దతు 

యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి

న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్‌ స్కీముకు కార్పొరేట్‌ దిగ్గజాలు మద్దతు పలికారు. దీనితో కార్పొరేట్‌ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు.

స్కీం విషయంలో అల్లర్లు చెలరేగడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్‌ మహీంద్రా, అగ్నివీరులుగా శిక్షణ పొందిన యువతకు తమ కంపెనీలో కొలువులిస్తామని తెలిపారు. ‘అగ్నిపథ్‌ స్కీముపై హింసాకాండ చెల రేగడం బాధ కలిగించింది. ఈ పథకంతో క్రమశిక్షణ, నైపుణ్యాలు పొందడం వల్ల అగ్నివీరులకు ఉద్యోగార్హతలు మెరుగు పడతాయని, వారికి మరింత ప్రాధాన్యం లభించగలదని దీన్ని గతేడాది ప్రతిపాదించినప్పుడే నేను చెప్పాను. అటువంటి సుశిక్షితులైన, సమర్ధులైన యువతను రిక్రూట్‌ చేసుకునే అవకాశాన్ని మేము స్వాగతిస్తున్నాము‘ అని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఇంతకీ మహీంద్రా గ్రూపులో అగ్నివీరులకు ఏ తరహా ఉద్యోగాలిస్తారంటూ ఒక ట్విటర్‌ యూజర్‌ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆపరేషన్స్‌ మొదలుకుని అడ్మినిస్ట్రేషన్, సరఫరా వ్యవస్థ నిర్వహణ వరకూ వివిధ విభాగాల్లో వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.  
సమాజంపై సానుకూల ప్రభావం.. 
మహీంద్రా ట్వీట్‌పై స్పందిస్తూ గోయెంకా ‘ఆర్‌పీజీ గ్రూప్‌ కూడా అగ్నివీరులను నియమించుకునే అవకాశాన్ని స్వాగతిస్తోంది. మన యువతకు భవిష్యత్‌పై నమ్మకం కలిగించేలా మిగతా కార్పొరేట్లు కూడా మా వెంట వస్తారని ఆశిస్తున్నాను‘ అని వ్యాఖ్యానించారు. ‘క్రమశిక్షణ, నైపుణ్యాలు గల అగ్నివీరులు.. మార్కెట్‌ తక్షణావసరాలకు తగిన పరిష్కార మార్గాలతో ఎంతగానో తోడ్పడగలరు. సమర్ధులైన యువతను రిక్రూట్‌ చేసుకోవడంలో పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను‘ అని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి ఒక ట్వీట్‌లో తెలిపారు. మరోవైపు, అగ్నిపథ్‌ స్కీము.. సమాజంపై గణనీయ స్థాయిలో సానుకూల ప్రభావం చూప గలదని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలదని టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ ఎండీ సుదర్శన్‌ వేణు అభిప్రాయపడ్డారు. ‘రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధనలో, సమాజాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంలో అగ్నివీరులు ముఖ్య పాత్ర పోషించగలరు‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవలు అందించడంతో పాటు టాటా గ్రూప్‌ సహా పరిశ్రమకు అత్యంత క్రమశిక్షణ గల, సుశిక్షితులైన యువతను అందించేందుకు అగ్నిపథ్‌ తోడ్పడగలదని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్‌ ద్వారా లభించే అవకాశాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అగ్గి రాజేసిన అగ్నిపథ్‌.. 
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు వారిని నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో రిక్రూట్‌ చేసుకునేందుకు ఉద్దేశించిన అగ్నిపథ్‌ స్కీమును జూన్‌ 14న కేంద్రం ప్రకటించింది. తర్వాత గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఇలా తీసుకునే వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. నాలుగేళ్లకు రిటైర్‌ అయ్యేవారికి నిర్దిష్ట ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా రూపొందించారు. అయితే, సాయుధ బలగాల్లో పూర్తి స్థాయి రిక్రూట్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్న అభ్యర్ధులు  దేశవ్యాప్తంగా  ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో హింసాకాండకు కూడా ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలోనే స్కీములోని సానుకూల అంశాలపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

మరిన్ని వార్తలు