చైనా ఎఫెక్ట్‌! క్రిప్టో మైనర్ల ఒప్పందాలు.. కరెంట్‌ కోతలతో పక్కదేశాల వైపు చూపు

29 Nov, 2021 16:58 IST|Sakshi

క్రిప్టోకరెన్సీకి భారీ మార్కెట్‌ అవుతుందేమోనని భావించిన చైనా.. దానిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్‌తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూర్ఖంగా ముందుకు పోతోందంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే  ఆ నిర్ణయం సరైందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని దేశాలు.  


ఈ ఏడాది మే నెలలో చైనా స్టేట్‌ కౌన్సిల్‌ ఏకంగా బిట్‌కాయిన్‌ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఫలితంగా గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగుతుందని, పైగా ఎనర్జీ విపరీతంగా ఖర్చై కరెంట్‌ కొరతలు ఏర్పడతాయని ప్రకటించుకుంది చైనా. ఆపై ఏకంగా క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రిప్టోకరెన్సీ తయారీ కోసం ఇంతకాలం చైనాలో  థర్మల్‌ కేంద్రాలపై ఆధారపడ్డ క్రిప్టోకరెన్సీ కంపెనీలు.. నిషేధం దెబ్బకు వేరే దేశాలకు క్యూ కట్టాయి. ఇదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది.

చైనాకు పొరుగున ఉన్న దేశాలతో ఖర్చు ఎంతైనా పర్వాలేదనుకుని ఒప్పందాలు చేసుకుంటున్నాయి క్రిప్టో కంపెనీలు. అయితే ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు నాలిక కర్చుకుంటున్నాయి. సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం పడుతుంది.  ఇది ఊహించని కజకిస్తాన్‌ లాంటి దేశాలు కరెంట్‌ కోతలను అనుభవిస్తున్నాయి. కంప్యూటర్‌ ఫామ్‌లకు నెలవైన కజకిస్తాన్‌లో ఇప్పుడు పట్టుమని నాలుగైదు గంటల సేపు కూడా పవర్‌ ఉండడం లేదు.  దీనికితోడు ఏర్పడిన కోతలను అధిగమించేందుకు రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది కజకిస్తాన్‌.

ఊహించని పరిణామాల నడుమ నష్టనివారణ చర్యలు చేపట్టింది కజకిస్తాన్‌ ప్రభుత్వం. 2022 జనవరి నుంచి క్రిప్టోమైనింగ్‌కు అవసరమైన విద్యుత్‌ సప్లయ్‌కి కఠిన నిబంధనలను విధించబోతోంది.  రేషన్‌ విధానంలో క్రిప్టో మైనర్లకు విద్యుత్‌ అందిస్తామని కజకిస్తాన్‌ గ్రిడ్‌ ఆపరేటర్‌ స్పష్టం చేసింది.ఒక్క కజకిస్తాన్‌ మాత్రమే కాదు.. ముప్ఫైకి పైగా దేశాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

క్లిక్‌ చేయండి: తెలివైన అడుగు.. అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ల తయారీ

>
మరిన్ని వార్తలు