క్యూ1కు సెకండ్‌ వేవ్‌ షాక్‌!

6 Jul, 2021 04:49 IST|Sakshi

క్యూ4(జనవరి–మార్చి) జోష్‌కు చెక్‌

ఏప్రిల్, మే నెల అమ్మకాలపై తీవ్ర ప్రభావం

బలహీనపడనున్న కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు

ఆటో, అప్లయెన్సెస్, హోటళ్లు, లైఫ్‌స్టైల్‌ రంగాలకు దెబ్బ

పరిశ్రమవర్గాలు, విశ్లేషకుల అంచనాలు

గతేడాది చివరి త్రైమాసికం (2020–21,  జనవరి–మార్చి)లో కార్పొరేట్‌ దిగ్గజాలు ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. అయితే ఇది పరిశ్రమ వర్గాలకు జోష్‌నివ్వడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ మొదలు దేశీయంగా తలెత్తిన కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌.. మరోసారి లాక్‌డౌన్‌లకు దారితీయడంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించనున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లో పలు కంపెనీలు మళ్లీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించవచ్చనేది విశ్లేషకుల అంచనా.

ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా ఉధృత రూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తంకావడంతోపాటు.. పారిశ్రామిక రంగాలకూ సెగ తగులుతోంది. ఇప్పటికే ఏప్రిల్‌ నెలలో పలు కంపెనీల అమ్మకాలు పడిపోగా.. మే నెలలో వైరస్‌ మరింత దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఆటో, ఆతిథ్యం, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ట్రావెల్, టూరిజం, విచక్షణాధారిత వినియోగం తదితర రంగాలు కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్‌ రంగంపై సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు తెలియజేశారు. ఈ పరిస్థితులు అత్యధిక రిస్కులకు దారితీయవచ్చని బ్యాంకింగ్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

హెల్త్‌కేర్‌ ఓకే....
ఇటీవల ప్రజలు ఆరోగ్య పరిరక్షణ, గృహ పరిశుభ్రత, నిత్యావసరాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆటో, వినియోగ వస్తువుల రంగ కంపెనీలు తయారీ ప్లాంట్లకు తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నాయి. నిల్వలను క్లియర్‌ చేసుకున్నాక తిరిగి ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత నిపుణులు తెలియజేశారు. వరుసగా రెండో ఏడాదిలోనూ జూన్‌ క్వార్టర్‌లో అప్లయెన్సెస్‌ మార్కెట్‌ను మహమ్మారి దెబ్బతీస్తున్నట్లు గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు.  

40 శాతం డౌన్‌ ...
ఈ ఏప్రిల్‌లో అమ్మకాలు 40 శాతం పడిపోయినట్లు నంది వెల్లడించారు. 2020 ఏప్రిల్‌లో అయితే లాక్‌డౌన్‌ కారణంగా మొత్తం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్లు గుర్తు చేశారు. ఇక మే నెలలో సైతం ఇదే స్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. నిజానికి వేసవి కారణంగా జూన్‌ త్రైమాసికం బిజినెస్‌లకు కీలకమని వినియోగ వస్తు కంపెనీల సమాఖ్య అధ్యక్షుడైన నంది తెలియజేశారు. అమ్మకాలలో 33 శాతం వరకూ క్యూ1లో నమోదవుతుంటాయని వివరించారు.

హోటళ్లు బేర్‌
కోవిడ్‌–19 కట్టడికి గతేడాది విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో 30–35 శాతం హోటళ్లు శాశ్వతంగా మూతపడినట్లు దేశీ హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జీఎస్‌ కోహ్లి ప్రస్తావించారు. ప్రస్తుత లాక్‌డౌన్, ఆంక్షల ఫలితంగా మరో 30 శాతం కనుమరుగయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కార్ల కొనుగోలు వంటి విచక్షణాధారిత వినియోగ రంగాలను సైతం వైరస్‌ దెబ్బతీస్తున్నట్లు మారుతీ సుజుకీ అమ్మకాలు, మార్కెటింగ్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ పట్టణాలలో లాక్‌డౌన్‌ల కారణంగా అమ్మకాలు పడిపోతున్నట్లు తెలియజేశారు.

ఇది మే నెల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు చెప్పారు. అయితే ఏప్రిల్‌లో పలు కంపెనీల ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పుంజుకున్నట్లు తెలియజేశారు. సుమారు 2,87,000 వాహనాలు అమ్ముడైనట్లు వెల్లడించారు. మే నెలలో తయారీ, సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడం కూడా అమ్మకాలను దెబ్బతీయనున్నట్లు వివరించారు. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా ఆటో రంగం సెమీకండక్టర్ల కొరత సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్‌ ఆటో అమ్మకాలు ఏప్రిల్‌లో నీరసించగా.. మే నెల మొదట్లోనూ డిమాండ్‌ భారీగా క్షీణించినట్లు కంపెనీ ఈడీ రాకేష్‌ శర్మ తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు