కోవిడ్, సైబర్‌ దాడులు, సమాచార మోసాలు..

11 Dec, 2020 08:09 IST|Sakshi

వీటితోనే భారత కంపెనీలకు తీవ్ర ముప్పు

మార్స్, రిమ్స్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్, సైబర్‌ దాడులు, సమాచార మోసాలు ప్రధాన ముప్పుగా భారత కంపెనీలు భావిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌ మార్స​, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సొసైటీ రిమ్స్‌ చేపట్టిన ఈ అధ్యయనంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధికారులు, సీనియర్‌ రిస్క్‌ నిపుణులు 231మంది పాలుపంచుకున్నారు.

అధ్యయనం ప్రకారం.. సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు మహమ్మారి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కోగలమన్న గొప్ప ఆశావాదం కంపెనీల్లో ఉంది. సైబర్‌ దాడులు, సమాచార మోసాలు భారత్‌లో రిస్క్‌ ప్రొఫెషనల్స్‌ ముందున్న ప్రధాన ఆందోళన. 63 శాతం మంది కోవిడ్, 56 శాతం సైబర్‌ దాడులు, 36 శాతం సమాచార మోసాలు, దొంగతనం, 33 శాతం అత్యవసర మౌలిక వసతుల విఫలం, 31 శాతం ఆర్థిక సంక్షోభం, 25 శాతం మంది తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రధాన ముప్పుగా తెలిపారు. మహమ్మారి కారణంగా కార్యాలయం వెలుపల పని చేయడం తప్పనిసరి అయిందని, దీంతో సైబర్‌ దాడులకు గురయ్యే అవకాశాలు పెరిగాయని 85 శాతం మంది అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు