కరోనా దెబ్బకు..ఈ-కామర్స్‌ రంగానికి పెరిగిన డిమాండ్‌! ఎంతలా అంటే!

16 Apr, 2022 22:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో దేశీయ స్థిరాస్తి రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటే.. గిడ్డంగుల విభాగానికి మాత్రం మహమ్మారి బూస్ట్‌లాగా పనిచేసింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ–కామర్స్‌ వినియోగం పెరిగింది. దీంతో ఆయా కంపెనీలు ఔట్‌లెట్లు, వేర్‌హౌస్‌ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. 

ఫలితంగా గతేడాది ముగింపు నాటికి దేశంలో గ్రేడ్‌–ఏ వేర్‌హౌస్‌ స్పేస్‌ 14 కోట్ల చ.అ.లకు చేరిందని అనరాక్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇందులో ఎన్‌సీఆర్‌ వాటా దాదాపు 15–20 శాతం వాటా ఉందని పేర్కొంది. 2018–21 మధ్య కాలంలో ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 16 శాతంగా ఉందని తెలిపింది. దేశంలోని 70 శాతం మోడ్రన్‌ వేర్‌హౌస్‌ స్పేస్‌లు ముంబై, ఎన్‌సీఆర్, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాలలో కేంద్రీకృతమై ఉన్నాయని అనరాక్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈఓ శోభిత్‌ అగర్వాల్‌ తెలిపారు. 

ఆన్‌లైన్‌ వ్యాపారాలలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో ప్రధాన నగరాలలో మల్టీలెవల్‌ వేర్‌హౌస్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్‌ సంస్థలు గిడ్డంగుల స్థలాల కోసం విస్తృతంగా శోధిస్తున్నారని, అదే సమయంలో నిర్వహణ వ్యయం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు