కరోనా సెకండ్‌ వేవ్‌ : బ్యాంకులకు చిక్కులు

10 Apr, 2021 09:55 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ : ఆర్థిక రికవరీపైనా ప్రభావం 

ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా 

కరోనా ఉధృతితో బ్యాంకులకు చిక్కులు 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లు రెండో విడత భారీగా పెరిగిపోతుండడం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రభావం చూపిస్తుందని.. బ్యాంకులకు సమస్యలు తెచ్చి పెడుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. 2021లో భారత బ్యాంకింగ్‌ రంగానికి మోస్తరు ప్రతికూల వాతావరణం ఉంటుందని పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతూ పోతే.. నియంత్రణ కోసం చేపట్టే మరిన్ని చర్యలు వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై మరింత ప్రభావం పడేలా దారితీస్తుందని.. అప్పుడు సమస్యలు తీవ్రమవుతాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న మరింత సర్దుబాటు ద్రవ్య విధానం స్వల్ప కాలంలో వృద్ధిపై ఒత్తిళ్లను అధిగమించేలా చేయవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండడం అన్నది టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం, సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటుంది’’అని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. 2021-22 సంవత్సరంలో భారత జీడీపీ 12.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఫిచ్‌ లోగడ అంచనా వేసిన విషయం గమనార్హం. అయితే పెరుగుతున్న కరోనా కేసులతో ఈ అంచనాలకు రిస్క్‌ ఉందని సంస్థ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి మందగించొచ్చని పేర్కొంది.  

బ్యాంకుల వ్యాపారంపై ప్రభావం.. 
‘‘80 శాతం నూతన ఇన్ఫెక్షన్‌ కేసులు ఆరు ప్రముఖ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో ఈ రాష్ట్రాల ఉమ్మడి వాటా 45 శాతం. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలపై ఇంకా ప్రభావం పడితే ఇప్పటికే బలహీనంగా ఉన్న వ్యాపార వాతావరణాన్ని ఇంకా దెబ్బతీస్తుంది’’అని ఫిచ్‌ తెలిపింది. రెండో విడత కరోనా కేసుల ఉధృతి వినియోగదారుల, కార్పొరేట్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. దీంతో బ్యాంకుల నూతన వ్యాపారాన్ని నెమ్మదించేలా చేయవచ్చని పేర్కొంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) వ్యాపార రుణాలు, రిటైల్‌ రుణాలకు ఎక్కువ రిస్క్‌ ఉంటుందని అంచనా వేసింది. రిటైల్‌ రుణాలు తమ అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ పెరుగుతున్న కేసుల ప్రభావం వీటిపై పడొచ్చని పేర్కొంది. (గేమింగ్‌కు మహిళల ఫ్యాషన్‌ హంగులు)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు