వ్యాక్సిన్‌‌: డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక ప్రకటన!

16 Jan, 2021 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వేళ దేశీ ఫార్మసీ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ కీలక ప్రకటన చేసింది. రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో త్వరలోనే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు శనివారం వెల్లడించింది. 1500 మందిపై వైద్య పరిశోధనలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండో దశ ఫలితాలు పరిశీలించిన అనంతరం, స్పుత్నిక్‌ వీ టీకా గురించి ఆందోళనలు అవసరం లేదని, డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు(డీఎస్‌ఎంబీ) ఫేజ్‌ 3 ప్రయోగాలకు పచ్చజెండా ఊపినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం తెలిపింది. 

ఈ మేరకు సంస్థ ఎండీ, కో- చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణలో ఇదొక మైలురాయి వంటిది. భారతీయుల కోసం ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నాం’’ అని తెలిపారు. కాగా రష్యాలోని మైక్రోబయోలజీ, ఎపిడిమాలజీ గమాలియా జాతీయ పరిశోధన సంస్థ స్పుత్నిక్‌ వీ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. స్థానిక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిండంతో, మార్కెట్‌లోకి విడుదల చేసిన తొలి కరోనా నిరోధక వ్యాక్సిన్‌గా నిలిచింది. (చదవండిప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ)

ఈ టీకా 91.4 శాతం ప్రభావంతంగా పనిచేస్తుందని రష్యా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తొలుత కొన్ని దేశాలు సందేహం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు యూఏఈ, ఈజిప్టు, వెనిజులా, బెలారస్‌ వంటి దేశాల్లో స్పుత్నిక్‌ వీ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, అల్జీరియా, అర్జెంటీనా, బొలీవియా, సెర్బియా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఇక భారత్‌లో స్పుత్నిక్‌ వీ పంపిణీ హక్కులను డాక్టర్‌ రెడ్డీస్‌​ ల్యాబ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కాగా దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను నేడు ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు