కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌- వొకార్డ్‌.. హైజంప్

4 Aug, 2020 10:40 IST|Sakshi

యూకే ప్రభుత్వంతో ఒప్పందం ప్రభావం

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు తయారీ సపోర్ట్‌

రెండో రోజూ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

3 రోజుల్లో 26 శాతం జంప్‌చేసిన షేరు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి వీలుగా ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశీ ఫార్మా రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో వరుసగా మూడో రోజు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30 ఎగసి రూ. 334 వద్ద ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 304 సమీపంలో ముగిసింది. వెరసి గత మూడు రోజుల్లోనే ఈ కౌంటర్‌ 26 శాతం దూసుకెళ్లింది. కాగా.. గత ఆరు సెషన్లుగా ఈ కౌంటర్‌ లాభపడుతూ రావడం గమనార్హం!

వ్యాక్సిన్‌ తయారీ
కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ కంపెనీ  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఈ వ్యాక్సిన్‌ తయారీ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తాజాగా వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌ ద్వారా కోవిడ్‌-19కు చెక్‌ పెట్టే AZD122 వ్యాక్సిన్‌ను వొకార్డ్‌ తయారు చేయనుంది. తద్వారా యూకే ప్రభుత్వానికి 3 కోట్ల డోసేజీలను సరఫరా చేయనుంది. తదుపరి దశలో 40 కోట్ల డోసేజీలవరకూ కాంట్రాక్టును పెంచుకునేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు