కోవిడ్‌-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!

29 Jul, 2020 14:44 IST|Sakshi

ఇవీ తొలి అంచనాలు..

మోడర్నా ఇంక్‌ 50-60 డాలర్లు

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ 39 డాలర్లు

ఆస్ట్రాజెనెకా పీఎల్‌సీ 4 డాలర్లు?

రేసులో మెర్క్‌, జాన్సన్‌అండ్‌ జాన్సన్‌

అంతర్జాతీయంగా ఫైజర్‌, మోడర్నా ఇంక్‌, ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, సనోఫీ- జీఎస్‌కే, మెర్క్‌ తదితర గ్లోబల్‌ ఫార్మా దిగ్గజాలు కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇందుకు వీలుగా ఇప్పటికే క్లినికల్‌ పరీక్షలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం పలు ఔషధాలు రెండు, మూడో దశ పరీక్షలకు చేరుకున్నాయి. సాధారణంగా నాలుగు దశల తదుపరి ఔషధ పరీక్షల ఫలితాలను విశ్లేషించాక సంబంధిత ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేస్తాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రోగుల భద్రత, వ్యాక్సిన్‌ పనితీరు తదితర పలు అంశాలను  పరిగణనలోకి తీసుకుంటాయని తెలియజేశాయి. కాగా.. 2020 డిసెంబర్‌లోగా మోడర్నా తదితర సంస్థలు వ్యాక్సిన్‌ను విడుదల చేసే అంచనాలు వేస్తుంటే.. సనోఫీ, జీఎస్‌కే 2021 తొలి అర్ధభాగంలో ప్రవేశపెట్టే వీలున్నట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశ, విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో వ్యాక్సిన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే.  ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలకు ఆరోగ్యపరమైన సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ధరలు తదితరాలపై వెలువడుతున్న అంచనాలను చూద్దాం..

60-4 డాలర్ల మధ్య
కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు యూఎస్‌, తదితర సంపన్న దేశాలలో 50-60 డాలర్ల చొప్పున ధరను మోడార్న్‌ ఇంక్‌   ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అయితే జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌ భాగస్వామ్యంతో ఫైజర్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు 39 డాలర్లను ప్రకటించే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. కాగా.. లక్షలాది మంది రోగులకు వినియోగించగల వ్యాక్సిన్ల ధరలపై ప్రభుత్వంతో తొలుత సంప్రదింపులు జరిపాకే ధరలు నిర్ణయమవుతాయని మోడర్నా ఇంక్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్‌ ప్రభుత్వం నుంచి ముందస్తుగా అందుకోనున్న 120 కోట్ల డాలర్ల చెల్లింపులకుగాను ఆస్ట్రాజెనెకా 4 డాలర్ల ధరలో 30 కోట్ల డోసేజీలను సరఫరా చేయవచ్చని మీడియా పేర్కొంది. యూఎస్‌ ప్రభుత్వం మోడర్నాకు సైతం 100 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను అందించిన విషయం విదితమే. 

30 కోట్ల డోసేజీలు
కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు తొలిసారి ఏప్రిల్‌లో చేతులు కలిపిన ఫార్మా దిగ్గజాలు సనోఫీ, జీఎస్‌కే.. 2021 తొలి అర్ధభాగంలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందగలమని భావిస్తున్నట్లు తెలియజేశాయి. క్లినికల్ పరీక్షలు విజయవంతమైతే 6 కోట్ల డోసేజీలను సరఫరా చేసేందుకు బ్రిటన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ బాటలో యూరోపియన్‌ యూనియన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలతోనూ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా 30 కోట్లకుపైగా డోసేజీలను సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా తెలియజేసింది.

మరిన్ని వార్తలు