కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్‌డేట్‌

26 Sep, 2020 11:29 IST|Sakshi

మూడో దశ క్లినికల్‌ పరీక్షలలో నాలుగు కంపెనీలు

మోడర్నా ఇంక్‌, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా ముందంజ

రేసులో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, భారత్‌ బయోటెక్‌

నోవావాక్స్, స్పుత్నిక్‌-వి, సనోపీ, క్యాన్సినో సైతం

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కోవిడ్‌-19 కట్టడికి గ్లోబల్‌ ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నిలువరించేందుకు వ్యాక్సిన్ల తయారీకి నడుం బిగించాయి. ఈ బాటలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్‌ పరీక్షలలో ఎంతో ముందంజ వేశాయి. అంతర్జాతీయ స్థాయిలో తొట్టతొలిగా రష్యా తయారీ వ్యాక్సిన్‌ అధికారికంగా రిజిస్టర్‌కాగా.. యూఎస్‌, బ్రిటన్‌ దేశాల ఫార్మా దిగ్గజాలతోపాటు.. దేశీయంగానూ కొన్ని కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీ సన్నాహాల్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి.

ఫలితంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు చేరాయి. దేశీయంగా భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా తదితరాలు రేసులో ఉన్నాయి. దీంతో కొత్త ఏడాది అంటే 2021 ప్రారంభంలో కోవిడ్‌-19 చికిత్సకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోవిడ్‌-19 బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో నమోదవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్ల పురోగతి వివరాలు ఎలా ఉన్నాయంటే...

మోడర్నా ఇంక్
జెనెటిక్‌ మెటీరియల్‌(ఎంఆర్‌ఎన్‌ఏ) ఆధారంగా యూఎస్‌ కంపెనీ మోడర్నా ఇంక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ కోవిడ్‌-19కు వ్యతిరేకంగా మానక కణాల్లో యాంటీజెన్‌ను ప్రేరేపిస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి)ని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాక్సిన్‌పై జులై 17  నుంచి 30,000 మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను మోడార్నా ప్రారంభించింది. 

ఫైజర్- బయోఎన్‌టెక్
జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో చేతులు కలపడం ద్వారా ఫైజర్‌ ఇంక్‌..  ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జులై 27 నుంచీ రెండు, మూడో దశల క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. యూఎస్‌తోపాటు బ్రెజిల్‌, జర్మనీ తదితర దేశాలలో వీటిని చేపట్టింది. ఒక్క యూఎస్‌లోనే 43,000 మందిపై ప్రయోగాలు చేపట్టే ప్రణాళికల్లో ఉంది.  

ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్
చింపాంజీ ఎడినోవైరస్‌ ఆధారంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్- స్వీడిష్‌ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందించింది. మే నెలలో రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించింది. యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలలో 17,000 మందిపై పరీక్షించింది. మూడో దశలో భాగంగా యూఎస్‌లో 30,000 మందిపై పరీక్షిస్తోంది. దేశీయంగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1,700 మందిపై ప్రయోగాలు చేపట్టింది. యూఎస్‌లో తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేసినప్పటికీ ఇతర దేశాలలో కొనసాస్తున్నట్లు తెలుస్తోంది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్
ఎడెనోవైరస్‌ వెక్టర్‌(ఏడీ26) ఆధారంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఇంతక్రితం ఎబోలా, జికా, ఆర్‌ఎస్‌వీ తదితరాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది సింగిల్‌ డోసేజీలో రూపొందింది. ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించింది. వివిధ దేశాలలో 60,000 మందిపై పరీక్షించే ప్రణాళికల్లో ఉంది.

నోవావాక్స్
దశాబ్దాలుగా రీకాంబినెంట్‌ నానోపార్టికల్‌ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. 1.5 బిలియన్‌ డాలర్లను ఇందుకు వెచ్చించినప్పటికీ ప్రయత్నాలు పెద్దగా సఫలంకాలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్‌-19కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనివ్వగలదని కంపెనీ భావిస్తోంది. ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ వ్యాక్సిన్‌గా పిలిచే ఈ ఔషధంపై కంపెనీ ఆశావహంగా ఉంది. యూకే ప్రభుత్వ సహకారంతో ఈ నెల 24 నుంచీ యూకేలో 10,000 మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించింది. ఏడాదికి 2 బిలియన్‌ డోసేజీల తయారీకి  దేశ కంపెనీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

స్పుత్నిక్‌-వి
తొలి రెండు దశల పరీక్షలు అత్యంత విజయవంతమైనట్లు ప్రకటించిన రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వి తొలిసారి అధికారిక రిజిస్ట్రేషన్‌ పొందింది. అయితే మరో 40,000 మందిపై రష్యాలో మూడో దశ క్లినికల్ పరీక్షలను ఈ నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా తయారీతోపాటు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు వీలుగా డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

భారత్‌ బయోటెక్‌
దేశీయంగా ఐసీఎంఆర్‌తో భాగస్వామ్యంలో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అందించిన స్ట్రెయిన్‌ ఆధారంగా ఇనేక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. జులై నుంచీ తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలను చేపట్టింది. అక్టోబర్‌లో మూడో దశ పరీక్షలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. దేశ, విదేశాలలో 25,000- 30,000 మందిపై ప్రయోగించే ప్రణాళికలున్నట్లు తెలుస్తోంది.

జైడస్‌ క్యాడిలా
ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏగా పిలిచే వ్యాక్సిన్‌ను జెనెటిక్‌ మెటీరియల్‌ ఆధారంగా రూపొందించినట్లు జైడస్‌ క్యాడిలా పేర్కొంది. వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలను జులైలో చేపట్టింది. మరో 15,000-20,000 మందిపై మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది.

సనోఫీ- జీఎస్‌కే
జీఎస్‌కేతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారీ, పంపిణీ సామర్థ్యాలు కలిగిన సనోఫీ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ ఆధారిత ఈ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలను ఈ నెల 3న ప్రారంభించింది. ఫలితాల ఆధారంగా ఈ ఏడాది చివరికల్లా మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది.

క్యాన్సినో బయోలాజిక్స్‌
హ్యూమన్‌ ఎడినోవైరస్‌(ఏడీ5) ఆధారంగా చైనా కంపెనీ క్యాన్సినో బయోలాజిక్స్‌ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇందుకు బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, మిలటరీ మెడికల్‌ సైన్స్‌ అకాడమీ సహకారాన్ని తీసుకుంది. ప్రత్యేక అవసరాలరీత్యా చైనీస్‌ మిలటరీ ఈ వ్యాక్సిన్‌ను జూన్‌ 25న అనుమతించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో 40,000 మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించింది. ఇందుకు రష్యా, పాకిస్తాన్‌, సౌదీ అరేబియా నుంచి అనుమతి పొందింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు