కానరాని ‘అక్షయ’ మెరుపులు.. టన్ను బంగారం కూడా అమ్మలేదు.. 

15 May, 2021 00:20 IST|Sakshi

అతి స్వల్పంగా బంగారం అమ్మకాలు 

కోవిడ్‌–19తోపాటు లాక్‌డౌన్‌ ప్రభావం 

సెంటిమెంట్‌ లేకపోవడమూ కారణమే

సాక్షి, హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్‌–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్‌ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. 


ఒక టన్ను కూడా అమ్మలేదు.. 
సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఆఫ్‌లైన్‌ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఆన్‌లైన్‌ విక్రయాలను వర్తకులు ప్రోత్సహించారని చెప్పారు. ‘90 శాతం రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్‌. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్‌ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు. షాపులు తెరిచినచోట 10–15 శాతం సేల్స్‌ జరిగే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు’ అని ఆల్‌ ఇండియా జెమ్స్, జువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆశిష్‌ పేథీ తెలిపారు. ఈ ఏడాది అక్షయకు 1 నుంచి 1.5 టన్నుల మధ్య సేల్స్‌ ఉండే అవకాశం ఉందని ఇండియా బులియన్, జువెల్లర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ వెల్లడించారు. 


సానుకూలంగా లేదు.. 
గతేడాదితో పోలిస్తే 2021 అక్షయ తృతీయ భిన్నమైనదని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ ఈడీ రమేశ్‌ కళ్యాణరామన్‌ తెలిపారు. సంస్థకు చెందిన 20 శాతం షోరూంలు మాత్రమే తెరుచుకున్నాయని, అది కూడా పరిమిత సమయమేనని చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కస్టమర్లు ఇష్టపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో సెంటిమెంట్‌ సానుకూలంగా లేదని పేర్కొన్నారు. ‘అక్షయ తృతీయ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లో రిటైల్‌ షాపులు ఉదయం 6 నుంచి 10 వరకే తెరిచేందుకు అనుమతి ఉంది. ఇది కస్టమర్లకు అసాధారణ సమయం’ అని వివరించారు. కరోనాకు భయపడి వినియోగదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారి గుల్లపూడి నాగకిరణ్‌ కుమార్‌ తెలిపారు. షాపింగ్‌కు తక్కువ సమయం ఉండడం, పుత్తడి కొనాలన్న ఆలోచన కూడా కస్టమర్లలో లేదని అన్నారు. కోవిడ్‌–19 ముందస్తుతో పోలిస్తే అమ్మకాలు స్వల్పమని సిరివర్ణిక జువెల్లర్స్‌ ఫౌండర్‌ వడ్డేపల్లి ప్రియమాధవి చెప్పారు. 

మరిన్ని వార్తలు