Covid Vaccination : 5 రోజులు 10 కోట్ల టీకాలు

22 Jun, 2021 15:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సినేషన్‌లో చైనా ప్రపంచ రికార్డు 

6 నెలల కాలంలో 101 కోట్ల టీకాలు

మొదటి పది కోట్లకు 3 నెలల సమయం 

తర్వాత రెండున్నర  నెలలలో 90 కోట్ల టీకాలు

చివరి 6 రోజుల్లో 10 కోట్లమందికి వ్యాక్సినేషన్‌ 

దేశ జనాభాలో 40 శాతం మందికి రెండు డోసులు 

వెబ్‌డెస్క్‌: కరోనాకే కొత్త పాఠాలు నేర్పింది చైనా. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను నిజం చేస్తూ కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంతో అదే పద్దతిలో టీకా కార్యక్రమం చేపట్టి కోవిడ్‌ 19కి చెక్‌ పెడుతోంది.  

వైరస్‌కి చెక్‌
కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా జరుగుతుందో అదే తీరులో టీకా కార్యక్రమాన్ని చైనా నిర్వహించింది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే 101 కోట్ల మందికి పైగా ఆ దేశ ప్రజలకు టీకాలు అందించింది. ఈ వివరాలను తాజాగా చైనాకి చెందిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. 

వ్యాక్సిన్‌ యాక‌్షన్‌ ప్లాన్‌
గత డిసెంబరులో కరోనా టీకా కార్యక్రమాన్ని చైనా ప్రారంభించింది. మార్చి నెల చివరి నాటికి కేవలం 10 కోట్ల డోసుల టీకాలు మాత్రమే అందివ్వగలిగింది. అయితే ఈ మూడు నెలల కాలంలో జరిగిన టీకా కార్యక్రమాన్ని బేరీజు వేసుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీంతో  ఆ తర్వాత కేవలం 25 రోజుల్లోనే 20 కోట్ల డోసుల టీకాలు ప్రజలకు అందించింది. ఆ వెంటనే 16 రోజుల వ్యవధిలోనే 30 కోట్ల టీకాలు అందించింది. ఇలా వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచుకుంటూ పోయింది. చివరకు 80 కోట్ల నుంచి 90 కోట్ల టీకాలు వేసేందుకు కేవలం 6 రోజుల సమయమే తీసుకుంది. సగటున ప్రతీ రోజు 1.7 కోట్ల వ్యాక్సిన్లు అందిస్తూ ఆరు రోజుల్లో పది కోట్ల మందికి పైగా ప్రజలకు చైనా వైద్య బృందం వ్యాక్సిన్లు అందివ్వగలిగింది. 

101 కోట్ల మంది
జూన్‌ 19 నాటికి 101,04,89,000 మందికి టీకాలు అందించినట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. జూన్‌ చివరి నాటికి దేశంలో 40 శాతం మంది ప్రజలకు రెండు డోసుల టీకా పూర్తవుతుందని చైనా వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 70శాతం మంది చైనీయులకు కరోనా నుంచి విముక్తి లభిస్తుందని అక్కడి ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. 

వైరస్‌ వ్యాప్తి
కరోనా వైరస్‌ వ్యాప్తి తొలి దశలో నెమ్మదిగా ఉంటుంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో లక్ష కేసులు నమోదు కావడానికి 117 రోజుల సమయం తీసుకుంటే 15 రోజుల్లోనే రెండు లక్షల కేసులకు చేరుకుంది. ఆ తర్వాత 10 రోజుల్లోనే మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయి. అక్కడి నుంచి 4 లక్షల కేసులకు చేరుకోవడానికి 8 రోజులు పట్టింది. చివరికి ఐదు లక్షల కేసులకు చేరుకోవడానికి కేవలం 6 రోజుల సమయమే తీసుకుంది. ప్రారంభంలో నెమ్మదిగా మొదలై ఆ తర్వాత వాయు వేగంతో కేసులు కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి తరహాలోనే చైనా  వ్యాక్సినేషన్‌ చేపట్టింది. 

2021 జూన్‌ 19 వరకు వివిధ  దేశాలకు సంబంధించి వ్యాక్సినేషన్‌ వివరాలు 
 

చదవండి: Fact Check: వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వయాగ్రా దోమల లీక్‌.. కలకలం!

మరిన్ని వార్తలు