కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు

29 Jul, 2020 15:26 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మారుతి సుజుకికి దశాబ్ద కాలంలో తొలిసారి నష్టాలు

249 కోట్ల రూపాయల నికర నష్టం 

సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ)  కరోనా , లాక్‌డౌన్‌ సంక్షోభంతో భారీ నష్టాలను నమోదు చేసింది. జూన్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 249.4 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో  1,435.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది.  ఆదాయం 79 శాతం క్షీణించి, 4,106.5 కోట్లకు చేరుకోగా, 2019 జూన్‌లో 19,720 కోట్ల రూపాయల ఆధాయాన్ని సాధించామని బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంఎస్‌ఐ తెలిపింది. జూన్ త్రైమాసికం అపూర్వమైందనీ, మొత్తం త్రైమాసికంలో ఉత్పత్తి కేవలం రెండు వారాల పనికి సమానమని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది.
 
మారుతి నికర అమ్మకాలు రూ .3,677.5 కోట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .18,735.2 కోట్లు. మొదటి త్రైమాసికంలో మొత్తం 76,599 వాహనాలను విక్రయించగా, దేశీయ మార్కెట్లో అమ్మకాలు 67,027 యూనిట్లు, ఎగుమతులు 9,572 యూనిట్లు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,02,594 యూనిట్లను విక్రయించింది.  కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా, ఇది కంపెనీ చరిత్రలో ఇదొక అసాధారణమైన త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా అమ్మకాలు, ఉత్పత్తి నిలిచిపోయాయని తెలిపింది. మే నెల చివరిలో మాత్రమే చిన్నగా కార్యకలాపాలను ప్రారంభిచినట్టు తెలిపింది. ముఖ్యంగా వినియోగదారులు, సప్లయ్‌  చెయిన్‌ అంతటా ఉద్యోగులు, ఇతరుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించింది.  మొత్తం త్రైమాసికం కేవలం రెండు వారాల రెగ్యులర్ పనికి సమానమనీ  ప్రస్తుత త్రైమాసిక ఫలితాలను ఈ కోణంలో చూడాలని కంపెనీ తెలిపింది.  కాగా ఒక దశాబ్దం తరువాత నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. దీంతో  మారుతి  సుజుకి దాదాపు 2 శాతం నష్టంతో కొనసాగుతోంది. 

>
మరిన్ని వార్తలు