స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్‌ సంస్థలతో..!

9 Apr, 2021 00:32 IST|Sakshi

కార్పొరేట్లతో కలిసి మార్కెటింగ్‌ అవకాశాల కల్పన

గ్రామాల్లో మౌలిక వసతులకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు

నాబార్డ్‌ సీజీఎం వైకేరావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) రాష్ట్రంలోని రైతు ఉత్పత్తుల సంస్థలు (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌) స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్‌ సంస్థలతో కలిసి మార్కెటింగ్‌ అవకాశాల కల్పన, ఇతరత్రా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు విషయంలో కీలక భూమికను పోషించనున్నట్టు నాబార్డ్‌ రాష్ట్ర సీజీఎం వైకే రావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు ఎఫ్‌పీవోలు ఒక్కటే మార్గమని, అందువల్లే వాటిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 330 ఎఫ్‌పీవోలకు అవసరమైన సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళుతున్నట్టు, 2020–21లో నవకిసాన్‌ ద్వారా 57 ఎఫ్‌పీవోలకు నాబార్డ్‌ క్రెడిట్‌ లింకేజీని ఇచ్చిందన్నారు.

బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అవసర మైన సహాయ సహకారాలను నాబార్డ్‌ అందిస్తుందని చెప్పారు. మొత్తంగాచూస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో నాబార్డ్‌ రాష్ట్రానికి రూ.20,549 కోట్ల మేర సహకారాన్ని, మద్దతును అందించినట్టు, ఇది 2019–20తో పోల్చితే 25.09 శాతం ఎక్కువని ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21లో బ్యాంకులకు రూ. 13,915.22 కోట్ల పంటరుణాలు, టర్మ్‌లోన్ల కింద అందజేసినట్లు, అందులో రూ.వందకోట్లు నాబార్డ్‌ మద్దతు అందించిన వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కింద మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం రూ. 4,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు రూ. 2,500 కోట్లు క్యాష్‌ క్రెడిట్‌ కింద మంజూరు చేసి పంపిణీ చేసినట్టు వైకేరావు వెల్లడించారు.

చదవండి: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నూతనోత్సాహం

 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు