ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం

14 Sep, 2021 06:15 IST|Sakshi

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌

కరోనా సవాళ్లు తొలగిన వెంటనే విశ్వసనీయ చర్యలకు పిలుపు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌  ఎన్‌కే సింగ్‌ పిలుపునిచ్చారు. కోవిడ్‌ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్‌కే సింగ్‌ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

  2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్‌ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం.  

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సూచనలు..
ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది.

2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది.  ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్‌ నిర్వహించిన సెమినార్‌లో 15 ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు