క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్‌ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

8 Oct, 2022 17:56 IST|Sakshi

క్రెడిట్ కార్డ్‌... దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కార్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలియక కొం‍దరు కార్డ్‌లో లిమిట్‌ ఉందని వాడుతూ తిరిగి చెల్లించే సమయంలో నానాఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి దెబ్బతో ఉద్యోగాల కోత, చెల్లించని బిల్లులు, క్లియర్ కాని ఈఎంఐ(EMI)ల ఫలితంగా లక్షలాది మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చెల్లించని క్రెడిట్ కార్డ్ బిల్లుల కారణంగా.. ఆలస్యంగా కట్టడంతో ఫైన్‌లు, వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఆర్థికంగా నష్టపరచడమే గాక మీ క్రెడిట్ స్కోర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆ సమయంలో వీటిని పాటించడం ద్వారా మీ భారం నుంచి కాస్త రిలీఫ్‌ పొం‍దచ్చని నిపుణుల చెబుతున్నారు.

1. మినిమం బ్యాలెన్స్‌ చెల్లించడం
క్రెడిట్‌ కార్డులోని మొత్తం రుణాన్ని చెల్లించకపోయినా, మినిమం బ్యాలెన్స్‌ నగదుని చెల్లించండి. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌ని ఆపరేట్‌ చేసుకోవడంతో పాటు మీపై పడే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాని వల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టంగా మారడంతో పాటు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.  కనీస చెల్లింపును కూడా చేయకుంటే,  అదనంగా లేట్‌ ఫైన్‌ కూడా కట్టాల్సి ఉంటుంది.

2. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ద్వారా రుణ భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే.. దాన్ని చెల్లించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లు డేంజరస్ లెవెల్‌కు చేరే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్ధితులు రాకముందే దాన్ని మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో అదే బ్యాలెన్స్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ పొందుతారు, అది కూడా తక్కువ వడ్డీ రేటు. కొత్త కార్డ్‌ కావడంతో సంస్థలు ఇచ్చే బెనిఫిట్స్‌తో పాటు చెల్లించేందుకు కాస్త సమయం దొరుకుతుంది.

3. పర్సనల్‌ లోన్‌గా మార్చుకోండి
మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల భారంగా మారి వాటిని సకాలంలో చెల్లించడం కుదరుని పక్షంలో పర్సనల్‌ లోన్‌ తీసుకుని వాటిని చెల్లించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీ రేటుతో మనకు లభిస్తాయి. పైగా క్రెడిట్‌ కార్డ్‌లా అధిక వడ్డీల భారం ఇందులో ఉండదు. వీటితో పాటు ఈఎంఐ( EMI) ఆఫ్షన్‌ కూడా ఉంటుంది.

4 మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకపోవడం మంచిది
రుణభారాన్ని మోస్తున్న కస్టమర్లు, ఆ బిల్లులు చెల్లించకుండానే మరిన్ని కొనుగోళ్లు చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్‌లో బిల్లు కొం‍డంత అవుతుంది. దాంతో అది మీ మొత్తం బకాయిపై వడ్డీ పడుతుంది, అది భారీ మొత్తంలో ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ని ఇష్టానుసారంగా కాకుండా క్రమపద్ధతిలో ఉపయోగించడం, అన్ని బకాయిలను క్లియర్‌ చేసుకుని, మళ్లీ ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: సామాన్యుడికి బిగ్‌ రిలీఫ్‌.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్‌!

మరిన్ని వార్తలు