క్రెడిట్‌కార్డ్‌... అవసరాలకు భరోసా!

9 Mar, 2023 04:07 IST|Sakshi

జనవరిలో రికార్డు రుణ పరిమాణం

విలువలో రూ.1.87 లక్షల కోట్లు

వార్షికంగా 30 శాతం వృద్ధి

ఆర్‌బీఐ నివేదిక  

న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ రుణ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరిలో వార్షికంగా వినియోగం 29.6 శాతం పెరిగి, రూ. 1,86,783 కోట్లుగా నమోదయ్యింది. 2022 జనవరితో  (13 నెలల్లో) పోల్చితే 32 శాతంపైగా పెరుగుదల (రూ. 1,41,254 కోట్ల నుంచి రూ. 1,86,783 కోట్లు) నమోదుకావడం గమనార్హం.  ఈ స్థాయిలో రుణాల విలువ నమోదుకావడం ఒక రికార్డు. డిజిటలైజేషన్‌పై విశ్వాసం పెరగడం ప్రత్యేకించి కోవిడ్‌ అనంతరం కాలంలో వినియోగ అవసరాలు దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెలువరించిన ఒక సర్వే గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు...

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (2022 ఏప్రిల్‌–2023 జనవరి) రుణ పరిమాణం 20 శాతం పెరిగింది. ఒక్క జూన్‌లో రికార్డు స్థాయిలో 30.7 శాతం పురోగతి కనబడింది.  
► 2023 జనవరి చివరినాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్‌ కార్డులు జారీ చేశాయి.  
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీలో మొదటి ఐదు స్థానాలూ ఆక్రమించాయి.  
► రోనా కష్టకాలం నేపథ్యంలో 2021 మధ్యలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది. సంబంధిత  సూచీ రికవరీ మార్గంలో పురోగమిస్తోంది. సాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొనడం, గృహ ఆదాయంపై మెరుగుదల వంటి సానుకూల సెంటిమెంట్‌  దీనికి నేపథ్యం.

చెల్లింపుల సౌలభ్యత
పలు విభాగాలు డిజిటలైజ్‌ అయ్యాయి. దీని ఫలితంగా కస్టమర్ల క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు పెరిగాయి.  ఆరోగ్యం, ఫిట్‌నెస్, విద్య, యుటిలిటీ బిల్లులు తదితర విభాగాల్లో ఖర్చు పెరగడానికి క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపుల సౌలభ్యత ఖచ్చితంగా దోహదపడింది. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగంలో నెలవారీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉంది.  గడచిన కొన్ని నెలలుగా క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాల్లో  స్థిరమైన వృద్ధి ఉంది. ముఖ్యంగా గత 11 నెలల నుండి క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు స్థిరంగా రూ. 1 లక్ష కోట్లు పైబడి ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. డిసెంబర్‌ 2022లో మొత్తం క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాల్లో  ఈ–కామర్స్‌ వాటా 60 శాతంగా ఉండడం మరో విశేషం. భవిష్యత్తులోనూ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం మరింత పుంజుకుంటుందని విశ్వసిస్తున్నాం.     
– రామమోహన్‌ రావు, ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈఓ

వ్యక్తిగత రుణాలు పెరుగుతున్నాయ్‌  
ఈ రోజుల్లో తనఖా రుణాలు, వ్యాపార రుణాలు వంటి సురక్షిత రుణాలు వెనుకబడుతుండగా, వ్యక్తిగత రుణ విభాగం పెరుగుతోంది. ఇప్పు డే ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న తాజా గ్రాడ్యుయేట్లు, వారి ముందువారి కంటే ఆర్థికంగా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. అలాగే వారి క్రెడిట్‌ స్కోర్‌లను అధికంగా కొనసాగించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఫిన్‌టెక్‌ కంపెనీలు ఆన్‌లైన్‌లో తమ కార్యకలాపాలను పెంచుకోవడం, సమాచారాన్ని పంచుకోవడంతో యువకులు మరింత సమాచారంతో క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లను చేస్తున్నారు. మహమ్మారి సమయంలో క్రెడిట్‌ కార్డులు ప్రధానంగా కిరాణా కొనుగో లు, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించడం జరిగింది. తిరిగి మళ్లీ ఆయా విభాగాల్లో క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు పెరుగుతున్నాయి.  
వీ స్వామినాథన్, ఆండ్రోమెడ లోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు