ఎంఎస్ఎంఈలకు రుణ హామీ పథకం పొడిగింపు

5 Oct, 2021 21:11 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ ఒత్తిళ్లలో ఉన్న సూక్ష్మ, లఘు, చిన్న మధ్య(ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలకు మద్దతుగా రుణ హామీ పథకాన్ని(సీజీఎస్‌ఎస్‌డీ) 2022 మార్చి 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. 2020 జూన్‌ 1వ తేదీన ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. అదే ఏడాది జూన్‌ 24న అమల్లోకి తీసుకువచ్చింది. కాగా ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ ఖాదీ ఇండియా షోరూమ్‌ అమ్మకాలు గాంధీ జయంతి సందర్బంగా రూ.1.02 కోట్లుగా నమోదయినట్లు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ మరో ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు మరో షాక్‌..! ఈ సారి రష్యా రూపంలో..!)

ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ఇటీవల ఖాదీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా పేర్కొన్నారు. ఈ పథకం కింద రుణాల పంపిణీ గడువును కూడా 2022 జూన్‌ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 2021 సెప్టెంబరు 24 వరకు ఈ పథకం కింద రూ.2.86 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో ఇచ్చిన రుణ హమీల్లో 85 శాతం వరకు ఎంఎస్‌ఎమ్‌ఈలకే మంజూరు చేశారు.

మరిన్ని వార్తలు